మన దేశంలో పెట్రోల్ కంటే డీజిల్ రేట్లు ఎప్పుడూ కాస్త తక్కువగానే కనిపిస్తాయి. కానీ తెర వెనుక జరుగుతున్న అసలు కథ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ కంటే డీజిల్ అమ్మకాలపైనే ఊహించలేనంత భారీగా నష్టాలను మూట కట్టుకుంటున్నాయి. పశ్చిమ ఆసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలతో క్రూడ్ ధరలు మండిపోతుండటంతో ఆయిల్ కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఈ మైండ్ బ్లోయింగ్ నష్టాల లెక్కలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనూజా స్వయంగా వెల్లడించారు. ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ.95.2 గా ఉంటే.. దీని వల్ల కంపెనీలకు వస్తున్న నష్టం అక్షరాలా రూ.30. అంటే మనం కొనే ప్రతి లీటర్ డీజిల్‌పై ఆయిల్ కంపెనీలే రూ.30 భారాన్ని మోస్తున్నాయి. అదే పెట్రోల్ విషయానికి వస్తే.. లీటరుకు సుమారు రూ.6 నష్టం వస్తోందట. పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ అమ్మకాలపైనే కంపెనీలు ఏకంగా 5 రెట్లు ఎక్కువ నష్టాన్ని భరిస్తుండటం వాటి లాభాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోందట.
►ALSO READ | కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ తెస్తున్న కేంద్రం : 50 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ!
అసలు ఇండస్ట్రీ పరంగా చూస్తే.. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల అమ్మకాల వల్ల ఇండియన్ ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. అయితే గత ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ నష్టాలు కొంత మేర తగ్గాయనే చెప్పాలి. ఏప్రిల్ 23 నాటి లెక్కల ప్రకారం.. లీటర్ పెట్రోల్‌పై రూ.20, డీజిల్‌పై ఏకంగా రూ.100 నష్టం వచ్చేది. ఆ సమయంలో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో స్థిరంగా 100 డాలర్ల పైనే ఉండటంతో కంపెనీల పరిస్థితి దారుణంగా మారింది.
ఈ నష్టాల నుంచి గట్టెక్కడానికి మే 15 నుంచి ఆయిల్ కంపెనీలు 4 విడతల్లో కలిపి లీటరుకు దాదాపు రూ.7.50 వరకు ధరలను పెంచాయి. అయినప్పటికీ నష్టాలు పూర్తిగా తగ్గనేలేదు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఒక దశలో రికార్డు స్థాయిలో 98.07 డాలర్లకు చేరి, ఆ తర్వాత 1.87% పెరిగి 94.83 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఆయిల్ కంపెనీల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది. ఒకవైపు సామాన్యుడిపై భారం పడకుండా చూస్తూనే.. మరోవైపు డీజిల్ అమ్మకాలపై వస్తున్న ఈ భారీ నష్టాలను కంపెనీలు ఎలా మేనేజ్ చేస్తాయనేది ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది. సో త్వరలోనే మరోసారి పెట్రోల్ డీజిల్ రేట్ల పెంపు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చూడాలి ఈసారి లీటరుకు ఎంత పెంచుతారో అన్నది.
