నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ఇక సత్వర సాయం.. ఇంటి పెద్దను కోల్పోతే రూ.20 వేలు సాయం

 నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ఇక సత్వర సాయం.. ఇంటి పెద్దను కోల్పోతే రూ.20 వేలు సాయం
  • ఆర్డీవోల నుంచి తప్పించి ఎంపీడీవోలు, మున్సిపల్  కమిషనర్లకు బాధ్యతలు
  • రాష్ట్రంలో రెండేళ్లలో 19,685 కుటుంబాలకు రూ.39.37 కోట్ల మేర లబ్ధి

హైదరాబాద్, వెలుగు:కుటుంబ పెద్ద అకస్మాత్తుగా మరణించి పుట్టెడు దుఃఖంలో ఉన్న పేద కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(నేషనల్​ ఫ్యామిలీ బెనిఫిట్​ స్కీమ్) కింద ఇక సత్వర సాయం అందనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న ఈ పథకం అమలులో జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

ఇప్పటివరకు ఈ స్కీమ్ ను ఆర్డీవోలు పర్యవేక్షిస్తుండగా, సాయం అందడంలో ఆలస్యమవుతోందని గుర్తించిన సర్కారు.. ఆ బాధ్యతలను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అప్పగించింది. అర్హులకు త్వరగా సాయం అందేలా వెబ్  పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త లాగిన్లను ఏర్పాటు చేసింది. 

తాజాగా ఈ పథకం కింద ప్రభుత్వం రూ.39.37 కోట్లు విడుదల  చేసింది. ఈ స్కీమ్​ కింద 2025–2026 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 15,420 మంది లబ్ధిదారులకు రూ.30.84 కోట్లు పంపిణీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే  4,265 మంది లబ్ధిదారులకు రూ.8. 53 కోట్లు  జమ చేశారు. రెండు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి 19,685 కుటుంబాలకు రూ. 39.37 కోట్ల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందించింది. 

రూ.20 వేల ఆర్థిక సాయం

జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం(ఎన్ఎస్ఏపీ) కింద అమలవుతున్న ఈ పథకం ద్వారా కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు  రూ.20,000 తక్షణ ఆర్థిక సాయాన్ని అందిస్తారు. మరణించిన పోషకుడు పురుషుడైనా లేదా మహిళ అయినా ఈ పథకం వర్తిస్తుంది.

 మరణించిన వ్యక్తి వయస్సు 18 ఏళ్లు నిండి 60 ఏళ్ల లోపు ఉండాలి. తెల్లరేషన్ కార్డు తప్పనిసరి. లబ్ధిదారుల కుటుంబం పేదరిక రేఖకు దిగువన ఉండాలి. ఆయన లేదా ఆమె సంపాదనపైనే ఆ కుటుంబ జీవనం ఆధారపడాలి. ఇతర బీమా పథకాలు వర్తించని పేద కుటుంబాలకు ఈ పథకంలో ప్రాధాన్యమిస్తారు. 

గతంలో ఆమ్  ఆద్మీ బీమా, జనశ్రీ బీమా లేదా ఆపద్బంధు పథకాల ద్వారా లబ్ధి పొందినవారు దీనికి అనర్హులు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు, అనాథలైన పిల్లలకు, ఆడపిల్లలు మాత్రమే ఉన్న పేద కుటుంబాలకు మొదటి ప్రాధాన్యమిస్తారు. గ్రామ పంచాయతీల్లో మల్టీ పర్పస్  వర్కర్లు(ఎంపీడబ్ల్యూ), ఫీల్డ్  అసిస్టెంట్లుగా(ఎఫ్ఏ) పని చేస్తూ చనిపోయిన వారికి  సైతం ఈ స్కీమ్​ వర్తిస్తుంది.

ఈ పత్రాలు జత చేయాలి..

 

  • ఫొటో జత చేసిన దరఖాస్తు పత్రం
  • తెల్ల రేషన్  కార్డు లేదా ఆహార భద్రతా కార్డు
  • కుటుంబ పోషకుని మరణ ధృవీకరణ పత్రం
  • మృతుడి ఆధార్ కార్డు
  • మృతుడి వయస్సు నిర్ధారణ పత్రం
  • దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు
  • దరఖాస్తుదారుని పాస్‌‌పోర్ట్  సైజు ఫొటో
  • ఆదాయ ధృవీకరణ పత్రం 
  • కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం 
  • దరఖాస్తుదారుడి చెల్లుబాటులో ఉన్న బ్యాంక్ పాస్ బుక్