ఆర్టీసీ ఉద్యోగుల గోస..డ్యూటీ ఇయ్యక ఆబ్సెంట్ వేస్తుండ్రు

ఆర్టీసీ ఉద్యోగుల గోస..డ్యూటీ ఇయ్యక ఆబ్సెంట్ వేస్తుండ్రు
  • తక్కువ బస్సులు నడుస్తుండటంతో అందరికీ దొరకని డ్యూటీలు
  • కండక్టర్లు, డ్రైవర్లు కొలువుకొచ్చినా లీవ్​ కిందనే లెక్క
  • లీవులు అయిపోతే ఆబ్సెంట్లు.. ఇప్పటికే సగం జీతాలు
    ఇంకా కోస్తే నాలుగైదు వేల జీతం కూడా రాదంటున్న సిబ్బంది

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు డ్యూటీకి వెళ్లినా ఆబ్సెంట్​ పడుతోంది. బస్సుల సంఖ్య తగ్గించడంతో అధికారులు ఆ మేరకు డ్రైవర్లు, కండక్టర్లకే డ్యూటీ ఇస్తున్నారు. మిగతా వాళ్లకు పని ఇవ్వకుండా లీవ్​ వేస్తున్నారు. లీవులు లేని వారికి ఆబ్సెంట్​వేస్తున్నారు. దీంతో జీతాల్లో కోత పడుతోందని.. ఇప్పటికే సగం జీతాలు ఇస్తుండగా ఇట్లా ఆబ్సెంట్లు వేస్తే ఎట్లాగని ఆర్టీసీ స్టాఫ్​ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు డబ్బు ఆదా చేసే పేరుతో ఉద్యోగుల పొట్టగొడుతున్నారని వాపోతున్నారు. జీతం ఐదారు వేలు వస్తే ఎట్లా బతకాలని ప్రశ్నిస్తున్నారు. నోరు విప్పి ఎవరికైనా చెప్తే ఆ మాత్రం డ్యూటీలూ వేయడం లేదని.. ఏం చేయాలో తెలియడం లేదని బాధపడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మే నెల జీతాల్లో అదనపు కోత పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సగం బస్సులే నడుస్తున్నయ్.. డ్యూటీలెట్ల?

లాక్ డౌన్ తో మార్చి 22 నుంచి మే 18 వరకు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీలో 10 వేలకుపైగా బస్సులున్నాయి. ఇటీవలి సమ్మె తర్వాత 800 వరకు కాలం చెల్లిన బస్సులను పక్కనపెట్టారు. లాక్ డౌన్ తర్వాత ఆర్టీసీ అధికారులు గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 6,200 బస్సులను రెడీ చేశారు. అయితే ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో 4,500 బస్సులు కూడా తిరగడం లేదు. దాంతో చాలా మంది డ్రైవర్లు, కండక్టర్లకు పని దొరకడం లేదు. డ్రైవర్లు, కండక్టర్లు డిపోలకు వస్తున్నా పనిదొరకడం లేదు. అలాంటి వారికి అధికారులు లీవ్​ వేస్తున్నారు. డ్యూటీకి వచ్చినా లీవ్​గా ఎలా పరిగణిస్తారని.. సెలవులు లేని వారికి ఆబ్సెంట్​ వేయడం దారుణమని డ్రైవర్లు, కండక్టర్లు వాపోతున్నారు. ఐదారు వేలు జీతం వస్తే కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే జీహెచ్ఎంసీలో కోతలు

గ్రేటర్ హైదరాబాద్ లో మే జీతాల్లో 50 శాతం కంటే ఎక్కువ కోత పెట్టారు. వివిధ కారణాలతో ప్రతి డిపోలో 50 నుంచి 70 మందికి కోత వేశారు. కొందరు డ్రైవర్లకు 3, 4 వేలే ఇచ్చారు. ఓ ఉద్యోగికి రూ.30 వేల జీతం ఉంటే.. 50 శాతం కట్‌‌ చేసి, రూ.15 వేలు చెల్లించాలి. మార్చి, ఏప్రిల్‌‌ నెల్లో అలాగే ఇచ్చారు. మే లో బాగా కట్​ చేశారు. హయత్ నగర్ డిపోలో 32 మంది కండక్టర్లకు జీతాలే ఇయ్యలేదని తెలిసింది.

టిమ్స్ డ్రైవర్ల కమీషన్​ కట్

ఆర్టీసీలో కండక్టర్లను తగ్గించాలనే ఉద్దేశంతో చాలా డిపోల్లో డ్రైవర్లకే టిమ్స్ (టికెట్​ ఇచ్చే మిషిన్లు) ఇచ్చి నడిపిస్తున్నారు. ఆ డ్రైవర్లకు కొంత కమీషన్​ ఇచ్చేవారు. కానీ నెల రోజులుగా దీన్ని ఆపేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారని, డ్యూటీలు వేయడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పై ఆఫీసర్ల ఆదేశాల మేరకే టిమ్స్​ కమీషన్​ను తాత్కాలికంగా నిలిపేశామని డిపో స్థాయి అధికారులు చెప్తున్నారు.

టెస్టులు చేసినా కొద్ది పెరుగుతున్న కరోనా కేసులు