వర్సిటీల్లో నియామకాలు వెంటనే చేపట్టాలి

వర్సిటీల్లో నియామకాలు వెంటనే చేపట్టాలి

హైదరాబాద్: నియామకాల్లో జాప్యం కోసమే వర్సిటీ నియామక బోర్డును ఏర్పాటు చేశారే తప్ప... దానితో ఎలాంటి ఉపయోగం లేదని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. విశ్వ విద్యాలయాల్లో బోధన, బోదనేతర సిబ్బంది నియామకాల కోసం ‘వర్సిటీ నియామక బోర్డు’ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ... ఎనిమిదేళ్లుగా ఎలాంటి నియామకాలు చేపట్టని ప్రభుత్వం... ఇవాళ ఎలాంటి చట్ట బద్దతలేని కమిటీని ఏర్పాటు చేయడం వెనుక నియామక ప్రక్రియను మరింత ఆలస్యం చేసేందుకు కుట్ర పన్నినట్లు అర్థమవుతోందని ఆరోపించారు.

నియామక బోర్డులో వీసీకి స్థానం లేకపోవడం దారుణమన్నారు. అధికార బలంతో వ్యవస్థలను తమ కబంధ హాస్తాల్లోకి తీసుకుంటూ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహారిస్తోందని, ఉద్యమ కేంద్రాలైన యూనివర్సిటీలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఫైర్ అయ్యారు. యూనివర్సిటీ టీచింగ్ పోస్టుల భర్తీ కేవలం మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలతో నియమించేది కాదని.. అకాడమిక్ విలువలు, పరిశోధన ప్రమాణాలతో వైస్ ఛాన్సెలర్, సీనియర్ ప్రోఫసర్ లచే జరగాల్సిన నియామకాలు ఐఏఎస్ అధికారుల బృందానికి అప్పగించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం యూనివర్సిటీలపై పక్షపాత వైఖరిని వీడి వెంటనే యూనివర్సిటీల స్వయంప్రత్తి ని కాపాడుతూ త్వరిత గతిన నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన  కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.