ఆన్ లైన్ చదువులే.. ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోండి

ఆన్ లైన్ చదువులే.. ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోండి

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది కూడా ఆన్‌‌లైన్‌‌ క్లాసులతోనే అకడమిక్‌‌ ఇయర్‌‌ ప్రారంభం కాబోతోంది. ఒకటి నుంచి పీజీ తరగతులకు జులై 1వ తేదీ నుంచి ఆన్‌‌లైన్‌‌ క్లాసులు స్టార్ట్‌‌ చేసుకోవడానికి సర్కారు పర్మిషన్‌‌ ఇచ్చింది. వచ్చే నెలలో జరిగే ప్రవేశపరీక్షలు, డిగ్రీ, డిప్లొమా, ఇతర కోర్సుల ఫైనల్‌‌ సెమిస్టర్‌‌ పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయంది. సర్కారు స్కూళ్లలో ఫస్ట్, సెకండ్ క్లాసులకు ఆగస్టు1 నుంచి డిజిటల్ పాఠాలు చెబుతామని చెప్పింది. సోమవారం హైదరాబాద్​లోని తన ఆఫీసులో ఆన్‌‌లైన్ క్లాసులు, ఎగ్జామ్స్ తదితరాలపై విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితాఇంద్రారెడ్డి సమీక్షించారు. స్టూడెంట్లు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకే ఆన్‌‌లైన్ క్లాసులు కొనసాగిస్తున్నామని చెప్పారు. టీవీలు, స్మార్ట్ ఫోన్ల ద్వారా స్టూడెంట్లు పాఠాలు వినొచ్చన్నారు. టీవీలు లేని స్టూడెంట్లు పంచాయతీ ఆఫీసులు, లైబ్రరీల్లోని టీవీలను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. సర్కారు స్కూళ్లలో చదువుతున్న 27 లక్షల మందికి డిజిటల్ పాఠాల ద్వారా లబ్ధి జరుగుతుందని చెప్పారు. 

90 శాతం టెక్ట్స్‌‌ బుక్స్‌‌ జిల్లాలకు చేరినయ్‌‌ 

స్టూడెంట్లకు అవసరమైన టెక్ట్స్ బుక్స్90 శాతం వరకు జిల్లాలకు చేరాయని మంత్రి సబితారెడ్డి తెలిపారు. విద్యా శాఖ నిర్వహిస్తున్న డిజిటల్, ఆన్‌‌లైన్ క్లాసుల్లో స్టూడెంట్లకు అనుమానాలుంటే అర్థమయ్యేలా చెప్పాలని టీచర్లను ఆదేశించారు. టీశాట్ యాప్‌‌లో, దూరదర్శన్ యూట్యూబ్‌‌లోనూ పాఠాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ప్రజ్ఞత గైడ్‌‌లైన్స్‌‌ను ఉల్లంఘిస్తే ప్రైవేటు స్కూల్ మేనేజ్‌‌మెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టూడెంట్లకు సంబంధించిన డిజిటల్ క్లాసులు, వర్క్​షీట్లను ఎస్‌‌సీఈఆర్టీ వెబ్‌‌సైట్ htts://scert.telangana.gov.in లో పొందొచ్చని చెప్పారు. బడుల్లోని పిల్లలకు, టీచర్ల మధ్య దాదాపు 75 వేల వాట్సాప్ గ్రూప్‌‌లను ఇప్పటికే ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. 

జులైలోని ఎగ్జామ్స్ యథాతథం 

పీజీ, డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లొమా ఫైనలియర్ స్టూడెంట్లకు ఎగ్జామ్స్‌‌ను జులైలో నిర్వహించేందుకు పర్మిషన్ ఇస్తున్నట్టు మంత్రి సబితారెడ్డి చెప్పారు. ఇప్పటికే కొన్ని వర్సిటీలు షెడ్యూల్ ప్రకటించిన విషయం గుర్తు చేశారు. జులైలో జరిగే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అన్నీ కొనసాగుతాయన్నారు. స్కూళ్లు, ఇంటర్, డిగ్రీ, టెక్నికల్​ తదితర అన్ని విద్యాసంస్థల్లో 50 శాతం స్టాఫ్ హాజరుకావాలని చెప్పారు. 

ఈసారీ ట్యూషన్ ఫీజులేనట

స్కూళ్లలో గతేడాది మాదిరిగా ఈ యేడాదీ ట్యూషన్ ఫీజులనే తీసుకోవాలని మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. ఫీజులను పెంచొద్దని, గతంలోనివే కొనసాగించాలని, ఒకేసారి కాకుండా నెలనెలా తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతమున్న ఫీజుల్లో 30 శాతం వరకూ మేనేజ్‌మెంట్లు తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆదేశాలతో జీవో నెంబర్ 75ను విద్యా శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా రిలీజ్ చేశారు. కాగా, ట్యూషన్‌ ఫీజులో డెవలప్‌మెంట్‌ ఫీజు, స్పెషల్‌ ఫీజు కూడా ఉంటాయని ‘వెలుగు’ ఇదివరకే బయటపెట్టింది. దీంతో ఎక్కువ ఫీజులు కట్టాల్సివస్తోందని స్టూడెంట్ల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. అయినా ఇవేం పట్టించుకోకుండా సర్కారు మళ్లీ పాత జీవోనే అమలు చేయాలంటూ కొత్తగా జీవో ఇచ్చింది.