- టేకు చెట్ల నరికివేత, రవాణా కోసం రూ. 2 లక్షల డిమాండ్
జగిత్యాల/కొడిమ్యాల, వెలుగు : టేకు చెట్ల నరికివేత, రవాణా కోసం పర్మిషన్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన జగిత్యాల జిల్లా కొడిమ్యాల రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ గులాం మొయినుద్దీన్‌ను ఏసీబీ ఆఫీసర్లు గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ సీఐ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం... కొడిమ్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన వ్యవసాయ భూమిలో ఉన్న120 టేకు చెట్ల నరికివేతతో పాటు రవాణా కోసం అనుమతి మంజూరు చేయాలని ఎఫ్‌ఆర్‌వో గులాం మొయినుద్దీన్‌ను కలిశాడు.
అనుమతులు ఇచ్చేందుకు రూ. 2 లక్షలు ఇవ్వాలని ఎఫ్‌ఆర్‌వో డిమాండ్ చేశాడు. ఇందులో ముందుగా రూ. లక్ష, పని పూర్తి అయిన తర్వాత మరో రూ. లక్ష ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో బాధితుడు గత నెల 13న రూ.లక్ష అందజేశాడు. పని పూర్తైన తర్వాత... మిగిలిన డబ్బుల కోసం ఎఫ్‌ఆర్‌వో ఒత్తిడి చేయడంతో సదరు వ్యక్తి ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో గురువారం కొడిమ్యాల రేంజ్ ఆఫీస్‌లో ఎఫ్‌ఆర్‌వో మొయినుద్దీన్‌ను కలిసి రూ. 80 వేలు ఇచ్చాడు.
అప్పటికే అక్కడికి చేరుకున్న ఏసీబీ ఆఫీసర్లు ఎఫ్‌ఆర్‌వోను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని, రూ. 80 వేలను స్వాధీనం చేసుకున్నారు. గులాం మొయినుద్దీన్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి, కరీంనగర్‌లోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. కాగా, ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో ఏసీబీ ఆఫీసర్లు దర్యాప్తు చేపట్టారు. ఇందులో జిల్లా అటవీశాఖ కార్యాలయానికి చేరుకున్న అధికారులు డీఎఫ్‌వో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని విచారణ జరిపినట్లు సమాచారం. బాధితుడి దరఖాస్తు తేదీ, అనుమతుల మంజూరు తేదీ, గతంలో ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్న రూ. లక్ష లావాదేవీలు తదితర అంశాలపై ఫైళ్లను పరిశీలించినట్లు సమాచారం.
