హైదరాబాద్ శివార్లలోని.. ఆర్టీఓ ఆఫీసులపై ఏసీబీ మెరుపు దాడులు

హైదరాబాద్ శివార్లలోని..  ఆర్టీఓ ఆఫీసులపై ఏసీబీ మెరుపు  దాడులు

హైదరాబాద్ శివారుల్లోని రవాణా కార్యాలయాలపై ఏసీబీ అధికారులు  కొరడా ఝులిపిస్తున్నారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారాయన్న పక్కా సమాచారంతో.. ఆర్టీఓ ఆఫీసులపై ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మేడ్చల్, కొండాపూర్, నాగోల్ రవాణా కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నాయి.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని.. పేట్ బషీరాబాద్ మేడ్చల్ ఆర్టీఓ ఆఫీస్‌లో ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 8 మంది అధికారుల బృందం రంగంలోకి దిగింది. వాహనదారుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. వారు ఎవరి ద్వారా ఇక్కడికి వచ్చారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మరోవైపు కొండాపూర్ ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ALSO READ : నీళ్లు వృథా చేసినందుకు రూ.10 వేల జరిమానా

ఇక నాగోల్‌లోని జగ్జీవన్ రామ్ ఆర్టీఏ (హైదరాబాద్ సెంట్రల్) కార్యాలయంలో.. హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలో దాడులు కొనసాగుతున్నాయి. ఆర్టీఏ ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను అధికారులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.

డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలు నడుస్తున్నాయనే పక్కా సమాచారంతోనే ఏసీబీ ఈ మెరుపు దాడులు చేపట్టింది. కార్యాలయాల్లోని రికార్డులను, నగదును అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏసీబీ తాజా దాడులతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.