
- వెయ్యికి పైగా డాక్యుమెంట్లు, 100పైగా పేజీలతో చార్జిషీట్
- గ్రీన్ కో నుంచి బీఆర్‌ఎస్‌కు వచ్చిన రూ.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్సే కీలకం
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ రేస్ కేసులో నిందితులైన కేటీఆర్, ఐఏఎస్ అర్వింద్‌కుమార్‌పై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ఈ నెల 9న ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేటీఆర్‌పై న్యాయ విచారణ జరిపేందుకు గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధానంగా క్విడ్ ప్రో కో విధానంలో గ్రీన్ కో సంస్థ నుంచి బీఆర్‌ఎస్‌కు వచ్చిన రూ.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్, హెచ్‌ఎండీఏ నిధుల దుర్వినియోగం, ఈ కార్ రేసింగ్ నిర్వహణ కోసం ఖర్చు చేయాలనుకున్న రూ.600 కోట్లకు సంబంధించిన పూర్తి ఆధారాలతో అభియోగ పత్రం సిద్ధం చేసినట్లు తెలిసింది. దాదాపు 100కు పైగా పేజీలతో కూడిన అభియోగపత్రంతో, వెయ్యికి పైగా డాక్యుమెంట్లను జత చేసినట్లు సమాచారం.
ఇందులో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు, బ్రిటన్‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్(ఎఫ్‌ఈవో), హైదరాబాద్‌కు చెందిన గ్రీన్ కో సిస్టర్ సంస్థ ఏస్ నెక్స్ట్ జెన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్(ఎంఏయూడీ)ల మధ్య జరిగిన అగ్రిమెంట్లు, హెచ్‌ఎండీఏ బోర్డు నుంచి నిధుల మళ్లింపుకు సంబంధించిన పత్రాలతో కేటీఆర్ సహా నిందితులపై చార్జిషీట్ దాఖలు చేయనుంది.
ఒప్పందాలు, నిధుల దుర్వినియోగం..
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో బ్రిటన్‌కు చెందిన ఎఫ్ఈవో హైదరాబాద్‌లో 9,10,11,-12 సీజన్లు నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25న ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఏయూడీ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ కార్ రేస్ నిర్వహణ ఖర్చును స్పాన్సర్ ఏస్ నెక్స్ట్ జెన్ భరించాలి. ఈ క్రమంలోనే 2023 ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించారు. కార్ రేసింగ్ ట్రాక్ నిర్మాణం కోసం హెచ్‌ఎండీఏ బోర్డ్ నుంచి రూ.12 కోట్లు ఖర్చు చేశారు.
ఈ సీజన్ నిర్వహణలో స్పాన్సర్ ఏస్ నెక్స్ట్ జెన్‌కు రూ.165 కోట్లు నష్టం వాటిల్లింది. దీంతో మిగిలిన 10,11,12 సీజన్ల నిర్వహణకు ఏస్ నెక్స్ట్ జెన్ చేతులెత్తేసింది. దీంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఎఫ్ఈవో, ఎంఏయూడీ మధ్య 2023 అక్టోబర్30న మరో కొత్త ఒప్పందం చేసుకుంది. ఫార్ములా ఈ రేస్‌కు మొత్తంగా రూ.600 కోట్లు ఖర్చు చేసేందుకు అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో గ్రీన్ కో గ్రూప్ ఆఫ్ కంపెనీల నుంచి క్విడ్ ప్రో కో రూపంలో రూ.44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్‌కు చేరినట్లు ఏసీబీ తన నివేదికలో వెల్లడించింది.