- హంగ్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గెలిచేందుకు వ్యూహాలు
- సీఎం ఆదేశాలతో రంగంలోకి మంత్రులు
- తమ పార్టీ అభ్యర్థులకు విప్ జారీ చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్
- పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకూ విప్ వర్తించేలా చర్యలు
- ఎన్నికలకు అన్నీ సిద్ధం చేసిన ఈసీ
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నంబర్ గేమ్‌లో గెలిచేదెవరో తేలే సమయం దగ్గర పడింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ ఫోకస్ పెట్టగా.. తమకు పట్టున్న చోట పీఠాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. సోమవారం కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్స్ ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా గెలిచిన వాళ్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత పాలకవర్గం ఎన్నికలు ఉంటాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తమకు ఆధిక్యం ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను చాలా ఈజీగా గెలుచుకోనున్నది. ఇదే క్రమంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని హంగ్ స్థానాలను సైతం కైవసం చేసుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నది.
ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగి రాష్ట్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. తమ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు జారిపోకుండా బీఆర్ఎస్, బీజేపీ విప్ జారీ చేయడానికి సిద్ధమయ్యాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సైతం విప్ వర్తించేలా బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు వేస్తున్నది. కాగా, 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పరోక్ష ఎన్నికలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ (ఎస్ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికలను చాలా పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతి చోట పోలీస్ బందోబస్తు మధ్య సీసీ కెమెరాల సహాయంతో వెబ్‌కాస్టింగ్ చేయనున్నారు.
ఎస్ఈసీ ఆదేశాలతో గత మూడు రోజులుగా క్యాంపుల్లో ఉన్న వాళ్లంతా సోమవారం ఉదయం 10 గంటల వరకు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చేరుకోనున్నారు.
మంత్రులకు కాంగ్రెస్ బాధ్యతలు..
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అధిక స్థానాలను గెలుచుకునేలా స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టారు. అభ్యర్థులను గుర్తించడంతో పాటు బీ ఫారాలు ఇవ్వడం, ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్మెంట్లాంటి పనులను రాష్ట్ర మంత్రులకు అప్పగించారు. ఒక్కో పార్లమెంట్ స్థానంలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలిపించుకునే బాధ్యతలను ఒక్కో మంత్రికి అప్పజెప్పారు. దీంతో ఆ పార్టీ చక్కటి ప్రణాళికతో ముందుకు పోవడంతో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో కలిపి మొత్తం 1,537 సీట్లు సాధించింది.
66 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో సంపూర్ణ ఆధిక్యం వచ్చింది. ఆయాచోట్ల కాంగ్రెస్ ఒంటరిగానే చైర్పర్సన్ సీటు దక్కించుకోనున్నది. 33 మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితి ఉండగా.. వీటిలో 19 మున్సిపాలిటీల్లో ఒకటి నుంచి మూడు వార్డుల చొప్పున ఆ పార్టీకి తక్కువగా ఉన్న సీట్లను ఇండిపెండెంట్ల సపోర్ట్, ఎక్స్అఫీషియో ఓట్లతో చాలా ఈజీగా గెలుచుకోనున్నది. ఇవి కాకుండా మిగిలిన 14 మున్సిపాలిటీలతోపాటు బీఆర్ఎస్కు ఆధిక్యం ఉన్న 15, బీజేపీ మెజారిటీ సీట్లు గెలిచిన 2 మున్సిపాలిటీలను సైతం ఏదో విధంగా తమ ఖాతాలో వేసుకోవడానికి ట్రై చేస్తున్నది. అలాగే, హంగ్ ఏర్పడిన కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్ల మేయర్ సీట్లను కైవసం చేసుకోవడానికి ఇతర పార్టీల మద్దతు తీసుకుంటున్నది.
ఆధిక్యం ఉన్న వాటినైనా కాపాడుకునేనా?
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 28.75 శాతం ఓట్లు సాధించి 781 సీట్లను, బీజేపీ 15.67 శాతం సీట్లు సాధించి 336 సీట్లను గెలుచుకున్నాయి. మున్సిపాలిటీల పరంగా పరిశీలిస్తే బీఆర్ఎస్కు 15 చోట్ల చైర్పర్సన్ దక్కించుకునే మెజారిటీ వచ్చింది. బీజేపీకి రెండు చోట్ల చాన్స్ ఉన్నది. కరీనంగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో మెజారిటీ సీట్లు గెలుచుకొని బీజేపీ మేయర్ సీటుపై కన్నేసింది. అయితే, ఇక్కడ కాంగ్రెస్ గేమ్ ప్లాన్ స్టార్ట్చేయడంతో గెలిచిన అభ్యర్థులను కాపాడుకోవడం, మెజారిటీ ఉన్న చోట్ల మేయర్, చైర్పర్సన్ సీట్లను గెలవడం ఆ రెండు పార్టీలకు చాలెంజ్‌గా మారింది.
సీఎం రేవంత్ ఆదేశాలతో స్వయంగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి బీఆర్ఎస్, బీజేపీ నుంచి గెలిచిన అభ్యర్థులను, ఆ పార్టీ రెబల్స్‌ను సైతం తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్స్ అఫీషియో ఓట్లను సైతం చాలా పకడ్బంధీగా ఉపయోగిస్తున్నారు. దీంతో హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలను పక్కన పెడితే తమకు పూర్తి మెజారిటీ ఉన్న వాటిలో మేయర్, చైర్పర్సన్ గెలిస్తే అంతే చాలు అన్నట్లుగా బీఆర్ఎస్, బీజేపీ పరిస్థితి ఉన్నది.
విప్ జారీ చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్
తమ పార్టీ గుర్తులపై గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పరోక్ష ఎన్నికల్లో ఇతర పార్టీ అభ్యర్థులు, ఇండిపెండెంట్లకు ఓటేయకుండా విప్ జారీ చేయడానికి బీఆర్ఎస్, బీజేపీ సిద్ధమయ్యాయి. ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్న పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా విప్ వర్తించేలా ఆ పార్టీ చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం మేయర్, చైర్పర్సన్ ఎన్నికల కోసం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు విప్ జారీ చేయవచ్చు.
‘చేతులెత్తే పద్ధతి’లో జరిగే ఈ ఎన్నికల్లో విప్ ఆదేశాలు పాటించడం ఆయా పార్టీల సభ్యులకు తప్పనిసరి. విప్ ఆదేశాలను ఉల్లంఘించి వేరొకరికి ఓటు వేసినా లేదా ఓటింగ్‌కు దూరంగా ఉన్నా.. వారు తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. విప్ జారీ చేసే అర్హత రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీల రాష్ట్ర అధ్యక్షులు లేదా ప్రధాన కార్యదర్శులకు మాత్రమే ఉంటుంది. అయితే, ఒకే రోజు.. ఒకే సారి ఎక్కువ సంఖ్యలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విప్ పర్యవేక్షణ అధికారాల కోసం మరొకరిని నియమించే అధికారం వీరికి ఉంటుంది.
విప్‌గా నియమితులైన వారు తమ పార్టీ నిర్ణయాన్ని తెలియజేస్తూ ఎన్నికల అధికారికి ఫారం-–బీ ని ప్రత్యేక సమావేశం ప్రారంభానికి గంట ముందుగా అందజేస్తారు. ఇందులో పార్టీ సభ్యులు ఏ అభ్యర్థికి ఓటు వేయాలో స్పష్టంగా పేర్కొంటారు. దీనిని ఆయా పార్టీల సభ్యులకు ఎన్నికల అధికారి అందజేస్తారు. పార్టీ సభ్యులందరికీ అందజేసినట్లు వారి సంతకాలతో కూడిన రసీదు స్వీకరిస్తారు. గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్అఫీషియో సభ్యులంతా కూడా విప్ ప్రకారమే ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ విప్ ధిక్కరిస్తే వారిపై చట్టపరమైన చర్యలను పార్టీ అధిష్టానం తీసుకుంటుంది. ‘‘సభ్యులు విప్ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేసినా.. ఆ ఓటు చెల్లుతుంది. అంటే ఎన్నికల ఫలితంలో ఆ ఓటును లెక్కిస్తారు. ఓటు చెల్లుబాటు అయినప్పటికీ, ఆ సభ్యుడు తన సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది’’ అని ఎన్నికల పరిశీలకులు తెలిపారు.
వారి పరిస్థితి ఏంటి?
బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా పాల్గొన్నట్లయితే ఆ పార్టీ అభ్యర్థికి ఓటేయాల్సి వస్తుంది. పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే చట్టపరంగా ఆధారాలతో సహా దొరికిపోతారని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు మున్సిపల్ ఎన్నికల మేయర్, చైర్ పర్సన్ ఎన్నికల్లో పాల్గొంటారా? లేకపోతే గైర్హాజరవుతారా?.. ఒక వేళ హాజరైతే ఏ పార్టీ అభ్యర్థులకు ఓటేయనున్నారు? అనే సస్పెన్స్ కొనసాగుతున్నది. ఈ వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
పరోక్ష పద్ధతిలో ఎన్నిక..
రాష్ట్రంలో గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తమ మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరుకావాలి. ఉదయం 11 గంటలకు ముందుగా గెలిచిన అభ్యర్థులతో ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత పరోక్ష పద్ధతిలో పాలకవర్గాల నియామకం ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ ఇప్పటికే 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల మేయర్, చైర్ పర్సన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటించింది. ఆ రిజర్వేషన్ల ప్రకారమే గెలిచిన అభ్యర్థుల్లో అదే క్యాస్ట్ కేటగిరీకి చెందినవాళ్లు మాత్రమే పోటీలో పాల్గొనాలి. జనరల్ స్థానం అయితే ఎవరైనా పోటీ చేయవచ్చు.
మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఒకే నామినేషన్ వస్తే ఏకగ్రీవంగా గెలిచినట్లుగా ప్రకటిస్తారు. రెండు నామినేషన్లు వచ్చినట్లయితే చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తారు. సమావేశానికి హాజరైన సభ్యులతోపాటు ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకొని 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు. ఇద్దరికీ సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
పటిష్ట భద్రత నడుమ ఎన్నిక..
రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పాలకవర్గాల నియామక ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినం. పరోక్ష పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలు చాలా పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతీ చోట సీసీ కెమెరాలతో వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. అవసరమైన చోట జిల్లా కలెక్టర్లు లైవ్ టెలి కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా ప్రతిచోటా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎలాంటి బెదిరింపులకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నాం.
- రాణి కుముదిణి, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్, హైదరాబాద్
మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రిజర్వేషన్ల వివరాలు..
- మొత్తం: 07
- ఎస్టీ జనరల్ 01,
- ఎస్సీ జనరల్ 01,
- బీసీ జనరల్ 02,
- బీసీ మహిళ 01,
- జనరల్ మహిళ 02
కార్పొరేషన్ రిజర్వేషన్
- కొత్తగూడెం: ఎస్టీ జనరల్
- రామగుండం: ఎస్సీ జనరల్
- మంచిర్యాల: బీసీ జనరల్
- కరీంనగర్: బీసీ జనరల్
- మహబూబ్‌నగర్: బీసీ మహిళ
- నిజామాబాద్: జనరల్ మహిళ
- నల్గొండ: జనరల్ మహిళ
మున్సిపాలిటీ చైర్పర్సన్ల రిజర్వేషన్ల వివరాలు..
- మొత్తం: 116
- ఎస్టీ జనరల్ 03, ఎస్టీ మహిళ 02
- ఎస్సీ జనరల్ 09, ఎస్సీ మహిళ 08
- బీసీ జనరల్ 18, బీసీ మహిళ 18
- జనరల్ (అన్ రిజర్వ్డ్) 27,
- జనరల్ (అన్ రిజర్వ్డ్) మహిళ 31
