
హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. 2025, జూలై 3వ తేదీ ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరవింద్ కుమార్ను పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని.. నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపు జరిగిందన్న అభియోగాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ1, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఏ2, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని ఏ3 నిందితులుగా చేర్చారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ విచారించింది. 2025, జూన్ లో కేటీఆర్ ను ఏసీబీ రెండోసారి విచారించింది. కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
►ALSO READ | రూ.100 కోట్ల అక్రమాస్తుల కేసు: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇళ్లలో ఈడీ సోదాలు