హైదరాబాద్: చందానగర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ తనిఖీలు జరిగాయి. లక్ష లంచం తీసుకుంటుండగా ఎస్సై రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరికిపోయాడు. రూ.లక్ష లంచం తీసుకుంటున్న ఎస్సై బాలరాజును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఎస్సై బాలరాజుతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు రఘు, రాజ్‌కుమార్ కూడా లంచం తీసుకుంటూ దొరికిపోయారు. లంచం వ్యవహారంపై పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లంచం తీసుకున్న వ్యవహారంపై ఏసీబీ అధికారులు పూర్తి వివరాలుసేకరిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఏసీబీకి పట్టుబడుతున్నా.. కేసులు నమోదై జైలుకు వెళుతున్నా కొంతమంది పోలీసుల తీరు మారడం లేదు. తమకు సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చడం, సెటిల్మెంట్స్ చేయడం, పైసలివ్వనిదే పని చేయకపోవడం పరిపాటిగా మారింది. ఇటీవల కొంతమంది పోలీస్ అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇలాంటి వాళ్ల వల్ల నిజాయితీగా పనిచేసే పోలీసులపై ప్రభావం పడుతుంది.
ఎఫ్ఐఆర్ నమోదు, నిందితులకు స్టేషన్ బెయిల్, చార్జ్ షీట్ దాఖలు ఇలా ప్రతి దాంట్లో కొందరు పోలీసులు అందినకాడికి దండుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో ఎలాంటి పనులు కావాలన్నా సరే.. రిసెప్షన్లో స్టేషనరీ ఖర్చులు సహా కోర్టు కానిస్టేబుల్ వరకు అడిగినంతా ఇచ్చుకోవాల్సిందే. ఇలా ప్రతీ పనికి ఓ రేట్ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. కింది స్థాయి సిబ్బందితో కలెక్షన్ చేయిస్తూ.. మధ్యవర్తులతో సెటిల్మెంట్స్ చేయిస్తున్నారు.
