డ్యామేజ్‌ అయిన జయదర్శిని అపార్ట్‌మెంట్‌ను పరీక్షిస్తాం.. అవసరమైతే అపార్ట్‌మెంట్‌లో C బ్లాక్‌ కూల్చివేస్తాం: హైడ్రా కమిషనర్

డ్యామేజ్‌ అయిన జయదర్శిని అపార్ట్‌మెంట్‌ను పరీక్షిస్తాం.. అవసరమైతే అపార్ట్‌మెంట్‌లో C బ్లాక్‌ కూల్చివేస్తాం: హైడ్రా కమిషనర్

హైదరాబాద్: గచ్చిబౌలి అంజయ్య నగర్లో ఏడంతస్తుల బిల్డింగ్ కూలి ఇద్దరు చనిపోయిన ఘటన హైదరాబాద్ సిటీలో హాట్ టాపిక్ అయింది. అంజయ్యనగర్‌లోని అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ బిల్డర్ నిర్మిస్తున్న భవనాలన్నీ నాలాల పక్కనే ఉన్నాయని, బిల్డర్‌ పైనా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు.

అంజయ్య నగర్‌లో అక్రమంగా నిర్మించిన మరో 4 భవనాలు గుర్తించామని హైడ్రా కమిషనర్ తెలిపారు. తక్కువ స్థలంలో నిబంధనలను ఉల్లంఘించి ఏడు, ఎనిమిది ఫ్లోర్లు వేసి హాస్టల్స్‌ నడుపుతున్నారని, డ్యామేజ్‌ అయిన జయదర్శిని అపార్ట్‌మెంట్‌ను నిపుణులతో పరీక్షిస్తామని, అవసరమైతే అపార్ట్‌మెంట్‌లో C బ్లాక్‌ కూల్చివేస్తామని.. అపార్ట్‌మెంట్‌వాసులు సహకరించాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కోరారు.

హైటెక్ సిటీ, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలతో పాటు, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట, పంజాగుట్ట, వెంగళావు నగర్, కూకట్ పల్లి, కేపీహెచ్ బీ, దిల్ సుఖ్ నగర్, పంజాగుట్ట, మెహిదీపట్నం, కాచిగూడ, సికింద్రాబాద్, అత్తాపూర్, ఉప్పల్, గాంధీ నగర్, విద్యానగర్, హిమాయత్ నగర్ వంటి ప్రాంతాల్లో ప్రైవేట్ హాస్టల్స్ ఎక్కువగా కనిపిస్తాయి.

విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్లు, సాఫ్ట్ వేర్ సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హాస్టళ్లు ఎక్కువగా ఉన్నాయి. చదువు, ఉద్యోగ ఉపాధి మార్గాలకు వెతుకుంటూ నగరానికి వచ్చేవారికి ఇవే ప్రధాన షెల్టర్లుగా ఉంటున్నాయి. కొందరు హాస్టల్స్ నిర్వాహకులు ఇలాంటి బిల్డింగులను లీజుకు తీసుకుని సేఫ్టీని పూర్తిగా గాలికొదిలేస్తున్న పరిస్థితి.