నాకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ వద్దు.. వచ్చినా జర్నలిస్టులకే ఇచ్చేస్తా: అఖిలేష్ యాదవ్

నాకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ వద్దు.. వచ్చినా జర్నలిస్టులకే ఇచ్చేస్తా: అఖిలేష్ యాదవ్

లక్నో: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలువురు రాజకీయ నాయకులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇవ్వాలన్న యోగి ప్రభుత్వ నిర్ణయంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. శనివారం (ఆగస్ట్ 22) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి తనకు ఇంకా బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ రాలేదని చెప్పారు. ఒకవేళ వచ్చినా తాను దానిని ధరించనని.. జర్నలిస్టులకే ఇచ్చేస్తానని చమత్కరించారు. ఈ జాకెట్లు తన కంటే అధికార పార్టీ నేతలకే ఎక్కువ అవసరమని పేర్కొన్నారు.

2027 ప్రారంభంలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో భద్రతా ముప్పు అంచనాల ఆధారంగా రాష్ట్రంలో పలువురు ప్రముఖ నాయకులకు రక్షణ కల్పించాలని యోగి సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 52 మంది ప్రముఖ నాయకులకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను ఇవ్వాలని నిర్ణయించింది. 

ఈ లిస్ట్ లో సీఎం యోగి, అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయమతి వంటి అగ్రనేతలు ఉన్నారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఒక్కొక్కదాని విలువ దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాత్రం తనకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వద్దని నిరాకరించడం గమనార్హం.