కరీంనగర్ క్రైం, వెలుగు : కరీంనగర్ జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీస్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాధికను ఏసీబీ ఆఫీసర్లు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ధనుక రాధిక గుడ్లు, పప్పులు తదితర సరుకులను ఐసీడీఎస్ కేంద్రాలకు సరఫరా చేసే కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు డిమాండ్ చేశారని, బిల్లుల క్లియరెన్స్‌ను స్పీడప్ చేస్తామంటూ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కుటుంబ సభ్యుల ఖాతాలకు యూపీఐ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారని ఆరోపణలు వచ్చాయి.
2022 జూన్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య మొత్తం రూ.2,37,500 మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. కాంట్రాక్టర్లు, అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు ఆఫీసర్లు గుర్తించారు. దీంతో బుధవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఈ వ్యవహారంలో మరికొందరి పాత్రపై కూడా విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
