ప్రభుత్వ ఉద్యోగులకు ఫేక్ ఏసీబీ కాల్స్‌‌‌‌‌‌‌‌

ప్రభుత్వ ఉద్యోగులకు ఫేక్  ఏసీబీ కాల్స్‌‌‌‌‌‌‌‌
  • అవినీతిపై ఫిర్యాదులు వచ్చాయని, కేసులు నమోదు చేస్తామని కేటుగాళ్ల బెదిరింపు
  • మా ఆఫీసర్లు ఫోన్లు చెయ్యరు: ఏసీబీ డీజీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ను నకిలీ ఏసీబీ బెడద వెంటాడుతోంది. ఏసీబీ అధికారులమని చెప్పుకుంటూ ప్రభుత్వ అధికారులను సైబర్  నేరస్తులు బ్లాక్ మెయిల్‌‌‌‌‌‌‌‌  చేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఖమ్మం జిల్లా టేకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అధికారికి ఇలాగే ఫేక్  కాల్   రావడంతో ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశా డు. ఇలా గత నెల రోజుల్లోనే ఏసీబీ అధికారులకు సుమారు 10కి పైగా  ఫిర్యాదులు అందడంతో ఏసీబీ హెడ్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌  ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.

 ఈ విషయాన్ని ఏసీబీ డీజీ విజయ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులకు ఏసీబీ అధికారుల పేరుతో  కాల్  చేసి బెదిరిస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఫేక్  కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన సూచించారు. ఏసీబీ పేరుతో కాల్స్‌‌‌‌‌‌‌‌  వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదన్నారు. అలాంటి ఫేక్‌‌‌‌‌‌‌‌  కాల్స్‌‌‌‌‌‌‌‌ పై వెంటనే ఏసీబీ టోల్‌‌‌‌‌‌‌‌ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు. స్థానిక పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌లోనూ కంప్లైంట్  ఇవ్వవచ్చని తెలిపారు. తెలంగాణ ఏసీబీ వాట్సాప్‌‌‌‌‌‌‌‌  94404 46106, ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌  TelanganaACB, ఎక్స్‌‌‌‌‌‌‌‌ @TelanaganaACB లోనూ ఫిర్యాదులు చేయవచ్చని వివరించారు.