తార్నాక, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారికి తగిన న్యాయం చేయాలని పలు జిల్లాలకు చెందిన ఉద్యమకారులు కోరారు. ఉద్యమకారులు చీమ శ్రీనివాస్, భూపాల్ ఆధ్వర్యంలో గురువారం తార్నాకలోని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతె శోభన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా ఉద్యమ కాలంలో తాము నిర్వహించిన పాత్ర, ఎదుర్కొన్న ఇబ్బందులు, ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గుర్తింపు ప్రక్రియలో పారదర్శకత, అర్హతకు ప్రాధాన్యం ఉండేలా చూడాలన్నారు. స్పందించిన శోభన్ రెడ్డి.. అర్హులైన ఉద్యమకారులందరికీ న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
