ప్రముఖ నటుడు ప్రతాప్ పోతన్ కన్నుమూత

ప్రముఖ నటుడు ప్రతాప్ పోతన్ కన్నుమూత

ప్రముఖ నటుడు, డైరెక్టర్ ప్రతాప్ పోతన్ (70) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో  తుది శ్వాస విడిచారు. ప్రతాప్ పోతన్ మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ఎన్నో సినిమాలు చేశారు. తెలుగులో ఆకలి రాజ్యం, కాంచన గంగ, మరోచరిత్ర, వీడెవడు సహా పలు సినిమాల్లో నటించారు. మమ్ముట్టి హీరోగా ఈ ఏడాది విడుదలైన ‘CBI5 ది బ్రెయిన్‌’లో ఆయన చివరిగా ఓ పాత్రలో నటించారు.  

ఆరవం సినిమాతో అరంగేట్రం..

1978లో వచ్చిన ఆరవం సినిమాతో ప్రతాప్ అరంగేట్రం చేశారు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన చివరి సినిమా ‘ఒరు యాత్రమొళి’. 1997లో విడుదలైన ఈ మూవీలో మోహన్‌లాల్ , శివాజీ గణేశన్ నటించారు. 1985లో వచ్చిన ‘మీండుమ్ ఒరు కాతల్ కథై చిత్రానికి దర్శకత్వం వహించినందుకు ప్రతాప్ పోతన్ కు జాతీయ అవార్డు వచ్చింది. 1985లో మీండుమ్ ఒరు కాతల్ కథై చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఇందిరా గాంధీ అవార్డ్ వచ్చింది. తెలుగులో చైతన్య అనే సినిమాకు డైరెక్షన్ చేశారు. మోహన్ లాల్ డైరెక్షన్ లో ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న బరోజ్ సినిమాలో ఆయన నటిస్తున్నారు.  

రాధికతో పెళ్లి.. ఏడాదిలోనే విడాకులు

ప్రతాప్ పోతన్ 1952 ఆగష్టు 13న జన్మించారు. ఊటీలోని లారెన్స్ స్కూల్, లవ్‌డేల్, మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో విద్యను పూర్తి చేశారు. మలయాళం, తమిళం, తెలుగుతో పాటు హిందీ భాషల్లో దాదాపు 100 సినిమాల్లో నటించి, 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రాధికను 1985లో పెళ్లి చేసుకున్న ప్రతాప్..1986 లో విడాకులిచ్చారు. ఆ తర్వాత 1990లో అమలా సత్యనాథ్‌ను మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. అమలా సత్యనాథన్ తో కూడా 2012 లో విడిపోయారు.