శివ సేనలో చేరిన ఊర్మిల.. ఎంట్రీతోనే సూపర్ ఆఫర్

శివ సేనలో చేరిన ఊర్మిల.. ఎంట్రీతోనే సూపర్ ఆఫర్

ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఊర్మిలా మటోండ్కర్ శివ సేన తీర్థం పుచ్చుకున్నారు. మహారాష్ట్ర సీఎం, శివ సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో ఊర్మిల పార్టీలో చేరారు. గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఊర్మిల.. పరాజయం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా శివ సేనలో ఆమె చేరుతారనే ప్రచారం జరుగుతోంది. మంగళవారం శివ సేనలో చేరడంతో ఎట్టకేలకు ఈ ఊహాగానాలకు తెరపడింది.

శివ సేన పార్టీ వర్గాల అంతర్గత సమాచారం ప్రకారం.. ఊర్మిలకు ఎమ్మెల్సీ పదవి వరించనుందని తెలుస్తోంది. ఈ మేరకు గవర్నర్‌కు పంపిన 12 మంది నామినేటెడ్ సీట్లలో ఆమె పేరును పంపారని సమాచారం. ముంబై మరో పీవోకేలా కనిపిస్తోందంటూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కామెంట్స్ చేసిన సమయంలో ఆమెను ఊర్మిల ఎదుర్కొన్న తీరుకు శివ సేన అధిష్టానం ఖుష్ అయిందని తెలుస్తోంది.