రూ.40 లక్షల దోపిడి కేసులో ట్విస్ట్. .నమ్మించి మోసం చేశాడు..అసలు సూత్రధారి కారు డ్రైవరే..

రూ.40 లక్షల దోపిడి కేసులో ట్విస్ట్. .నమ్మించి మోసం చేశాడు..అసలు సూత్రధారి కారు డ్రైవరే..

రంగారెడ్డి జిల్లా  శంకర్ పల్లిలో  రూ. 40 లక్షల దారి దోపిడీ  కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 12న రాత్రి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే వ్యాపారి కారు డ్రైవర్  మధు   పాత పరిచయంతో నమ్మించి మోసం చేసినట్లు పోలీసులు తేల్చారు. 

పోలీసుల వివరాల ప్రకారం.. వ్యాపారి రాకేష్ అగర్వాల్ తన మేనేజర్ సాయిబాబాను క్యాష్ కలెక్ట్ చేసుకోవడం కోసం  నియమించుకున్నాడు. సెప్టెంబర్ 12న  వికారాబాద్ లో కస్టమర్ దగ్గర నుంచి డబ్బు వసూలు చేయమని చెప్పాడు.  సాయిబాబా..ఎల్బీ నగర్ కు చెందిన  మధు అనే  క్యాబ్ డ్రైవర్‌ ప్రైవేట్ కారును తీసుకుని క్యాష్ కలెక్షన్ కోసం వెళ్ళాడు .  మధుతో సాయిబాబాకు పాత పరిచయం ఉండటంతో నగదు రవాణా పనుల కోసం తరచూ అతనిని వాడుకునేవాడు.  ఉదయం 11:30కు వికారాబాద్ చేరుకున్న సాయిబాబా.. అన్సారీ నుంచి రూ.40 లక్షలు కలెక్ట్ చేసుకుని హైదరాబాద్ బయల్దేరాడు.  హుస్సేన్‌పూర్ గేట్ దగ్గర  వెనుక నుంచి వచ్చిన స్విఫ్ట్ డిజైర్ ఢీ కొట్టి అడ్డగించింది. అందులో ముగ్గురు దుండగులు దిగి సాయిబాబాను కొట్టి బెదిరించి నగదు దోచుకెల్లా. నిందితులు కారులో పారిపోతుండగా కొత్తపల్లి శివార్లలో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.  దీంతో నిందితులు కారు వదిలేసి కాలినడకన పారిపోయారు.  స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శంకర్‌పల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. 5 బృందాలు ఏర్పాటు చేసి కేవలం 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నాం.  దోపిడీలో మొత్తం 7 మంది ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.  డ్రైవర్ మధు ఒక సంవత్సరం క్రితం సాయిబాబాతో పరిచయం అయి నమ్మకం సంపాదించాడు.  సాయిబాబా తరచూ డబ్బు తీసుకెళ్తాడని గమనించిన మధు, ఈ ప్రయాణం గురించి ముందే ప్లాన్ చేశాడు.  మధు తన స్నేహితులు విజయ్ కుమార్, అజార్‌లకు సమాచారం ఇచ్చాడు, వారు హర్షను దోపిడీలో భాగం కలిపారు. హర్ష తన స్నేహితులు అనుదీప్, దీపక్, షమీమ్ ముల్లాలను కలిపి మరో బృందాన్ని ఏర్పాటు చేశాడు.రెండు కార్లతో ఎస్కార్ట్ కమ్ బ్యాకప్ ప్లాన్ వేసి, హుస్సేన్‌పూర్ గేట్ వద్ద రోడ్డు ఖాళీగా ఉండే సమయంలో దాడి చేశారు. మధు డ్రైవింగ్‌లో వేగం తగ్గించి సహకరించడంతో హర్ష కారు ఢీ కొట్టి దోపిడీ సులభం అయ్యింది,అనంతరం అనుదీప్‌కి చెందిన కారులోనే ప్రధాన నిందితులు తప్పించుకోవాలని ప్లాన్ చేశారు.కానీ కొత్తపల్లి దగ్గర కారు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో మొత్తం కుట్ర బయటపడింది.జడ్చర్లలోనే మొదట కారు యజమాని అనుదీప్‌ను అరెస్ట్ చేశారు.తర్వాత సంగారెడ్డి, షాద్‌నగర్ పోలీసులను అప్రమత్తం చేసి ముంబై, బెంగళూరు హైవేలపై వాహన తనిఖీలు చేశారు.   జహీరాబాద్, రాయికల్ టోల్‌ప్లాజా వద్ద మిగతా నిందితులు పట్టుబడ్డారు.

స్థానిక పోలీసులు, SOT, CCS టీమ్స్ సమన్వయంతో కేసు సక్సెస్‌ఫుల్‌గా చేధించారు. నిందితుల   నుంచి రూ.17.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  కొంత నగదు స్థానికంగా ఉండేవారు పట్టుకెళ్లారు . నగదు తీసుకెళ్ళిన స్థానికుల గురించి ఆరా తీస్తున్నాం .  అని పోలీసులు తెలిపారు.