కంటోన్మెంట్ కాంగ్రెస్ టికెట్ రేసులో అద్దంకి దయాకర్

కంటోన్మెంట్ కాంగ్రెస్ టికెట్ రేసులో  అద్దంకి దయాకర్

కంటోన్మెంట్ నియోజక వర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బైఎలక్షన్ అభ్యర్థిత్వం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో దివంగత గద్దర్ ​కూతురు వెన్నెల ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆమె మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇప్పుడు కూడా ఆమె టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈసారి ఆమెకు టికెట్​ దక్కే చాన్స్​ లేదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్ రెండు రోజుల క్రితం కాంగ్రెస్​లో చేరారు. టికెట్ వస్తుందన్న నమ్మకంతోనే పార్టీ మారినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు లాస్య నందిత సోదరి నివేదిత కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ హైకమాండ్​ మాత్రం కొత్త వ్యక్తిని ఇక్కడి నుంచి బరిలో దింపాలని భావిస్తున్నట్టు సమాచారం. 

అందులో భాగంగానే కాంగ్రెస్​ సీనియర్  నేత అద్దంకి దయాకర్​ను పోటీలో దించే అవకాశం ఉందని ఆ పార్టీలో ప్రచారం జరుగుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్​కు టికెట్ ఇవ్వలేదు. అలాగే ఇటీవల ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగినా ఆఖరి నిమిషంలో ఆయనకు ఆ పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ నుంచి ఆయనకు అవకాశం కల్పించే చాన్స్ ​ఉందని చెప్తున్నారు.