నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి అదనపు హంగులు.. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా చర్యలు

నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి అదనపు హంగులు.. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా చర్యలు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేయడంతో  పాటు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్రీస్తుశకం రెండో శతాబ్దం నాటి ఈ స్తూపాన్ని ఇతర దేశాల బౌద్ధ మత ఆరాధకులు సందర్శించేలా, ఇక్కడే బస చేసేలా సౌకర్యాలు కల్పించేందుకు ప్లాన్‌‌‌‌ చేస్తున్నారు. ఇప్పటికే నిర్మించిన వసతి గృహాల్లో మరిన్ని మెరుగైన వసతులతో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని, ఆధ్యాత్మిక టూరిజం పెరిగేలా ప్లాన్‌‌‌‌ రూపొందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి ఇప్పటికే ఆఫీసర్లను ఆదేశించారు. 

స్తూపం అభివృద్ధికి ఇప్పటికే రూ. 2.50 కోట్లు మంజూరు అయ్యాయి. దీంతో పాటు అంతర్జాతీయ స్థాయి హంగులు అద్దేందుకు ఇంకా ఎన్ని నిధులు కావాలి ? ఎలాంటి పనులు చేపట్టాలన్న అంశాలపై డీపీఆర్‌‌‌‌ సిద్ధంచేయాలని మంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆర్కియాలజీ శాఖ ఉన్నత స్థాయి బృందం ఇటీవల క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. రెండు నెలల్లో డీపీఆర్‌‌‌‌ను రెడీ చేసి ప్రభుత్వానికి అందించనుంది.  ఖమ్మం జిల్లా కేంద్రానికి 24 కిలోమీటర్ల దూరంలో ఈ బౌద్ధ క్షేత్రం ఉంది.

 దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద స్తూపంగా చెబుతుండగా, చాళుక్యుల కాలంలో బౌద్ధుల ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లినట్టు ఇక్కడ జరిపిన తవ్వకాల్లో బయటపడింది. 1976లో నేలకొండపల్లి, ముజ్జుగూడెం మధ్య ఈ స్తూపాన్ని గుర్తించారు. పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరపడంతో 106 అడుగుల వ్యాసం, 60 అడుగుల ఎత్తులో ఉన్న స్తూపం బయటపడింది. సమీప ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో బుద్ధుడి పాలరాతి విగ్రహాలు, మట్టి పాత్రలు, మట్టి పూసలు, ఇక్ష్వాకులు, శాతవాహనుల కాలం నాటి నాణేలు, పంచలోహ విగ్రహాలు, ఆరామాలు బయటపడ్డాయి. 

వీటన్నింటిని మ్యూజియంలో భద్రపరిచారు. ఈ స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని 2009లో రూ.1.26 కోట్లతో పనులు చేపట్టి చుట్టూ పార్క్‌‌‌‌, ఫెన్సింగ్‌‌‌‌ ఏర్పాటుచేశారు. తర్వాత రూ.కోటితో గెస్ట్‌‌‌‌హౌజ్‌‌‌‌ నిర్మించారు. ఇటీవల ఆర్కియాలజీ మ్యూజియం డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్‌‌‌‌రావు, బుద్ధవనం ప్రాజెక్ట్‌‌‌‌ మెంటార్ సి.ఆంజనేయరెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికారులు, పురావస్తు నిపుణుల బృందం నేలకొండపల్లి స్తూపాన్ని పరిశీలించింది. ఇప్పటికే మంజూరైన రూ. 2.50 కోట్ల వినియోగంతో పాటు భవిష్యత్‌‌‌‌ నిధుల అంచనాలు, ల్యాండ్‌‌‌‌ స్కేపింగ్‌‌‌‌, పర్యాటక హంగుల రూపకల్పనపై నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో సమీక్షించింది.

ఎన్‌‌‌‌జీఆర్‌‌‌‌ఐ సహకారంతో భూగర్భ సర్వే

మాస్టర్‌‌‌‌ప్లాన్‌‌‌‌లో భాగంగా ఉపరితల తవ్వకాలకే పరిమితం కాకుండా ఎన్‌‌‌‌జీఆర్‌‌‌‌ఐ సహకారంతో భూగర్భ జియోఫిజికల్ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. దీని ద్వారా భూగర్భంలో దాగివున్న చారిత్రక అవశేషాలను వెలికితీసి రక్షించనున్నారు. అలాగే, పర్యాటక వసతుల విస్తరణ కోసం సుమారు నాలుగు ఎకరాల భూమిని సేకరించాలని తీర్మానించారు. 

ఇక్కడ పర్యాటకుల కోసం చరిత్రను ప్రతిబింబించే త్రీడీ ఇంటర్‌‌‌‌ప్రిటేషన్ సెంటర్, ఆడియో -విజువల్ గ్యాలరీలు, ఓపెన్‌‌‌‌ ఎయిర్ ఆంఫీ థియేటర్, అంతర్జాతీయ స్థాయి వాకింగ్‌‌‌‌ ట్రాక్‌‌‌‌లు, లైటింగ్‌‌‌‌ వంటి వసతులను నివేదికలో చేర్చనున్నారు. పూర్తి అంచనాలతో కూడిన మాస్టర్‌‌‌‌ప్లాన్‌‌‌‌ను రెండు నెలల్లో ప్రభుత్వానికి అందజేస్తామని ఆర్కియాలజీ డైరెక్టర్‌‌‌‌ అర్జున్‌‌‌‌రావు తెలిపారు.