అడవితల్లి జాతర

అడవితల్లి జాతర

అడవిబిడ్డల దైవం జంగుబాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో కొలువైన ఈ తల్లికి ఏటా పుష్య మాసంలో జాతర చేస్తారు. ఈ ఏడాది కూడా సంప్రదాయం ప్రకారం జంగుబాయి క్షేత్రంలో నెలవంక కనపడగానే జాతర మొదలైంది. ఆదివాసీల దేవతలు ప్రకృతికి ప్రతిరూపాలు. జంగుబాయి కూడా దీపం రూపంలోనే దర్శనం ఇస్తుంది. నెల రోజుల పాటు ఈ తల్లిని పూజించి జాతర చేస్తారు ఇక్కడి అడవి బిడ్డలు. ఈ జాతరకు తెలంగాణా, ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల నుంచి లక్షలాది ఆదివాసీలు మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. 


తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన మహరాజ్ గూడ సహ్యాద్రిపర్వత ప్రాంతంలో జంగుబాయి తల్లి వెలసింది. సహజసిద్ధంగా ఏర్పడ్డ  గుహలో జంగుబాయి జ్యోతి రూపంలో దర్శనం ఇస్తుంది. దీనికి వేల ఏండ్ల చరిత్ర ఉందని చెప్తారు. పుష్యమాసం నెలవంక కోసం ఎదురుచూసిన జనం ఆ వేకువజామునే అమ్మ దగ్గరకు బయల్దేరతారు. గోండులు, పర్దాన్​, కోలాం తెగలకు చెందిన గిరిజనులు ఇక్కడికి వచ్చి దైవ దర్శనం చేసుకుంటారు. జంగుబాయి జాతరను డోలు, తుడుం, సన్నాయి వంటి మేళాలతో ఘనంగా దీపోత్సవం చేసి ప్రారంభిస్తారు. ఈ  క్షేత్రం ముందే ఉన్న టోప్లకస వాగులో పుణ్య స్నానాలు  ఆచరించి దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ. 
 

ఎంతో భక్తితో..


నెలరోజుల పాటు కొనసాగే ఈ జాతర పూర్తయ్యే వరకు ఎంతో నియమ నిష్టలతో ఉంటారు. ఉదయమే ఆవుపేడతో అలుకుచల్లుతారు. పూజకు సంబంధించిన ఏర్పాట్లు మొదలుపెట్టాక చెప్పులను ఇంటి ఆవరణలోకి తీసుకురారు. ఈ నెల రోజులు  నేలపైనే పడుకుంటారు. బయట మంచినీళ్లు కూడా తాగరు. జాతర అయ్యేవరకు చెప్పులు వేసుకోరు. ఇంటి దేవుళ్లను వెదురు బుట్టల్లో పెట్టి మోసుకుంటూ జాతరకు తీసుకొస్తారు. ఆ దేవతా విగ్రహాలను టోప్లకస నీళ్లతో అభిషేకిస్తారు. తరువాత తమతో తీసుకుపోతారు. సుదూర ప్రాంతాల నుంచి జాతరకు వచ్చే భక్తులు మధ్యలో బస చేయాల్సి వచ్చినా పూజాసామగ్రి ఉన్న గంపను నేలపై దించరు. అందుకోసం మూడు బండలను పేర్చి గోమూత్రంతో శుభ్రం చేసి, దాని మీద గంప పెడతారు.  జంగుబాయి అమ్మ గుహనుంచి బయటికి వచ్చేటప్పుడు కనిపించే విసురురాయిని లేపగలిగితే కోరిన కోర్కెలు తీరతాయని నమ్ముతారు. అలాగే క్షేత్రంలో ఉన్న గుర్రాల బొమ్మను పట్టుకున్నప్పుడు అవి కదిలితే అనుకున్నది జరుగుతుందని అంటారు.
 

అమ్మకు నైవేద్యాలు


తుమ్రం, కొడప, సలాం, రాయిసిడాం,హెర్రెకుమ్ర, మరప, వెట్టి, మందడి గోత్రాల కటోడాలు (పూజారులు) పుష్య మాసం మొదటి రోజు పూజాసామగ్రితో కాలినడకన జంగుబాయి తల్లి దగ్గరకు వెళ్తారు. రాత్రి దీపారాధన చేసి ప్రత్యేకంగా తయారుచేసిన నైవేద్యాలను సమర్పిస్తారు. ఆదివాసీ రైతులు పండించిన వడ్లను దంచి బియ్యం సేకరిస్తారు. గోధుమ పిండి, పప్పుబెల్లాలు,  పోలెలు, పెసరగారెలు, మినపగారెలు వంటివి నైవేద్యం కోసం క్షేత్రంలోనే తయారుచేస్తారు. వంటలన్నీ సంప్రదాయ పద్ధతిలోనే చేస్తారు. అరవన్నం, చిట్టి గారెలు, బెల్లం, నువ్వుల వంటకాలు తెల్లటి వస్త్రం మీద పరచి కొబ్బరికాయ కొట్టి సమర్పిస్తారు. కింద ఉన్న మైసమ్మ పోచమ్మల దగ్గర మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కులు తీర్చుకుంటారు. అందరూ కలిసి భోజనాలు చేస్తారు. మాంసం, జొన్న సంగటితో శెనగపిండి​ కలిపి తింటారు.                                                                                                                                                                      ::: మసాదే  సంతోష్ కుమార్, ఆసిఫాబాద్, వెలుగు