సాదాబైనామా భూములకు పాస్​బుక్​లు

సాదాబైనామా భూములకు పాస్​బుక్​లు
  • రికార్డుల్లో తప్పులు సవరణ 
  • ధరణి లోపాలు సరి చేసేందుకే ‘భూభారతి’ 
  • కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్
  • పలు గ్రామాల్లో ‘భాభారతి’ అవగాహన సదస్సులు

కామారెడ్డి, వెలుగు : సాదాబైనామాలతో కొనుగోలు చేసిన భూముల రెగ్యులరైజేషన్​కోసం ఇచ్చిన దరఖాస్తులను ఆర్డీవో పరిశీలించి పాస్​ పుస్తకాలు అందజేస్తారని కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ తెలిపారు. బుధవారం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి,  రాజంపేట, తాడ్వాయి మండల కేంద్రాల్లో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సుల్లో కలెక్టర్ మాట్లాడారు.  ధరణి పోర్టల్​ లోపాలు సరి చేసేందుకు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని, రికార్డుల్లో తప్పులుంటే సరి చేసుకోవచ్చన్నారు. 

ప్రతి రైతుకూ ఆధార్ కార్డు తరహాలో భూధార్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఎలాంటి భూ సమస్యలపై అయినా రైతులకు ఉచిత న్యాయ సాయాన్ని అధికారులు అందిస్తారన్నారు. మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే దర్యాప్తు చేసి, నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వీణ,  ఆయా మండలా ల తహసీల్ధారులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.  

జిల్లాలో లక్షా 81 వేల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోళ్లు ..

కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 22,785 మంది రైతుల నుంచి  1,81,776 మెట్రిక్​ టన్నుల వడ్లు కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు.  ఇందులో 59,354 మెట్రిక్​ టన్నులు దొడ్డు రకం, 1,22,422 మెట్రిక్​ టన్నుల సన్నరకం వడ్లు ఉన్నాయన్నారు.   బుధవారం మంత్రులు ఉత్తమ్​కుమార్​రెడ్డి,  తుమ్మల నాగేశ్వర్​రావు కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియోకాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా  కలెక్టర్​ మాట్లాడుతూ కొనుగోలు సెంటర్లలో రైతులకు సమస్యలు లేకుండా చూస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్​లో అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్,  ఆర్డీవో వీణ,  ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.