ఎవరీ అసిమ్ మాలిక్.. పాకిస్తాన్ కొత్త ఎన్ఎస్ఏ, ఐఎస్ఐ చీఫ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..

ఎవరీ అసిమ్ మాలిక్.. పాకిస్తాన్ కొత్త ఎన్ఎస్ఏ,  ఐఎస్ఐ చీఫ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..

పహల్గాం ఉగ్రదాడితో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్దవాతావరణం నెలకొన్న క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అసిమ్ మాలిక్‌ను ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు (NSA)గా నియమించింది పాక్ ప్రభుత్వం. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో  పరిణామం కీలకంగా మారింది.

ఈమేరకు పాకిస్తాన్ ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.. ISI చీఫ్‌ను NSAగా నియమిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది పాక్ ప్రభుత్వం. 2024 సెప్టెంబర్‌లో అసిమ్ మాలిక్ ISI చీఫ్ గా నియమించబడ్డారు.

ఎవరీ అసిమ్ మాలిక్:

లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్ పాకిస్తానీ త్రీ-స్టార్ జనరల్, ప్రస్తుత ISI డైరెక్టర్ జనరల్. ISI డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన మొదటి PhD హోల్డర్ అసీమ్ మాలిక్. ఈయన పంజాబీ అవాన్ కుటుంబంలో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ గులాం ముహమ్మద్ మాలిక్‌కు జన్మించారు.

అసీమ్ మాలిక్ పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ 80వ లాంగ్ కోర్సు నుండి పట్టభద్రుడయ్యాడు. స్వోర్డ్ ఆఫ్ ఆనర్ అవార్డు కూడా అందుకున్నాడు మాలిక్. 1989లో 12వ బలూచ్ రెజిమెంట్‌లో నియమించబడ్డాడు అసీమ్ మాలిక్.

ఆయన ఇస్లామాబాద్‌లోని నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీలో చీఫ్ ఇన్‌స్ట్రక్టర్‌గా..  క్వెట్టాలోని పాకిస్తాన్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు.  2021 అక్టోబర్ లో, మేజర్ జనరల్‌గా ఉన్న సమయంలో మాలిక్ లెఫ్టినెంట్ జనరల్ హోదాకు దక్కించుకున్నారు.