ఓల్డ్‌సిటీ, వెలుగు: పహడీ షరీఫ్ పరిధిలోని జల్పల్లిలో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. జల్పల్లిలోని ఎస్.కే రాయల్ ఎంటర్ప్రైజెస్, షాహీ గోల్డ్ కంపెనీల్లో కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. సుమారు రూ.10 లక్షల విలువైన సింథటిక్ రంగులు, కల్తీ పేస్ట్ నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఈ కల్తీ తయారీకి పాల్పడుతున్న అబ్దుల్ సత్తార్, మహ్మద్ ఇస్రాయిల్, ఇఫ్తేఖర్, నూర్ నబీ అనే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, ప్యాక్ చేసిన 340 డబ్బాలను సీజ్ చేశారు.
