భారత్‌కు బౌలింగ్ ఛాన్స్.. టాస్ గెలిచిన బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘన్

భారత్‌కు బౌలింగ్ ఛాన్స్.. టాస్ గెలిచిన బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘన్

India vs Afghanistan 3rd ODI: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆఖరిదైన మూడో వన్డే కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే మొదటి రెండు వన్డేలు గెలిచి 2–0తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్‌ను 3–0తో క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది.

ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ షాహిదీ మాట్లాడుతూ.. పిచ్ చాలా డ్రైగా, హార్డ్‌గా కనిపిస్తోందని, మొదట బ్యాటింగ్‌కు అనుకూలించే ఛాన్స్ ఉందని చెప్పాడు. ఇండియాలో ఈ నెలలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, గత రెండు మ్యాచ్‌ల్లో తాము చేసిన తప్పులను సరిదిద్దుకుని, ఈ మ్యాచ్‌లో మంచి భాగస్వామ్యాలు (Partnerships) నెలకొల్పి పెద్ద స్కోరు బోర్డుపై పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ మ్యాచ్ కోసం ఆఫ్ఘనిస్థాన్ జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చేశాం.. సీనియర్ ప్లేయర్ మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్‌లు మళ్లీ తుది జట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు. 

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తాము టాస్ గెలిచినా మొదట బ్యాటింగే తీసుకునేవాళ్లమని, చెన్నైలో ఎండ విపరీతంగా ఉన్నందున టాస్ అంత కీలకం కాదన్నాడు. ఈ సిరీస్‌లో భారత్ ఇంకా ఛేజింగ్ (Target Chasing) చేయలేదు కాబట్టి, మూడో మ్యాచ్‌లో టార్గెట్‌ను ఛేజ్ చేసి గెలవడం తమకు ఒక మంచి పరీక్ష అని గిల్ పేర్కొన్నాడు. సిరీస్ ఆల్రెడీ చేతిలో ఉండటంతో భారత్ ఈ మ్యాచ్‌లో మూడు కీలక మార్పులు చేసింది. ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబేలను తుది జట్టులోకి తీసుకొచ్చారు.

ఇరు జట్లు 
ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), దర్విష్ రసూలీ, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, AM ఘజన్‌ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ, మలీక్ ఫరీద్

భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్