పంజాగుట్ట, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లలో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని మరో మూడేండ్లు పెంచి 46 ఏళ్లకు చేర్చాలని నిరుద్యోగుల హక్కుల వేదిక డిమాండ్ చేసింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వేదిక కన్వీనర్ అశోక్ మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు వారిని మోసం చేస్తోందని మండిపడ్డారు.
నీళ్లు, నిధులు, నియమకాల కోసం ఏర్పడిన తెలంగాణలో నాయకులు తమ పదవులను భద్రపరుచుకుంటూ నిరుద్యోగులను విస్మరిస్తున్నారని ఆరోపించారు. గురుకుల, ట్రైబల్ వెల్ఫేర్ వంటి నోటిఫికేషన్లలో నిబంధనలు అస్తవ్యస్తంగా ఉండటం వల్ల అభ్యర్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే వయోపరిమితిని పెంచి ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలని, లేనిపక్షంలో లక్ష మందితో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సింధు, కొండా రంజిత్, అచ్చంపేట లక్ష్మణ్, సోమేష్ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

