- కరెంట్ కోతలు, ఆత్మహత్యలు, విత్తన కొరతతో రైతుల ఆందోళన: కేటీఆర్
- పార్టీలు వస్తుంటయ్.. పోతుంటయ్.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఏర్పాటుకు ముందున్న వ్యవసాయ సంక్షోభం మళ్లీ వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరెంట్ కోతలు, ఆత్మహత్యలు, విత్తనాల కొరత, ఎరువుల కొరత, ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం వంటి సమస్యలతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ధాన్యం కొనుగోలుకు కూడా మంత్రులు చర్చలు చేయడం, సబ్‌కమిటీలు వేయడమేంటని ప్రశ్నించారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోల్చి వేర్పాటువాద సమస్యగా చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్కడ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలున్నా చేష్టలుడిగి చూస్తూ కూర్చున్నారు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. తేజస్వి సూర్య తనకు ఫోన్ చేసి తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారని, ఆయన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండించానని తెలిపారు. కాగా, పార్టీ కమిటీలను రద్దు చేశామని, త్వరలోనే మళ్లీ కమిటీలను నియమిస్తామని తెలిపారు. కవిత పార్టీపై, ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని.. పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. 25 ఏండ్లు పూర్తి చేసుకున్న పార్టీలు చాలా తక్కువ అని, బీఆర్ఎస్, టీడీపీ మాత్రమే నిలదొక్కుకున్నాయని చెప్పారు.
చీప్‌గా మాట్లాడొద్దు..
రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్‌లా మాట్లాడాలని, చీప్ మినిస్టర్‌గా మాట్లాడొద్దని కేటీఆర్ సూచించారు. విధానపరమైన అంశాలపై మాట్లాడితే తాము జవాబిస్తామన్నారు. కానీ, ఎంతసేపూ విషం చిమ్మడం, తిట్టడం, అస భ్య పదజాలం తప్ప ఇంకోటి ఆయన నోటి నుంచి రాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పైరీ అయిందని మాట్లాడే ముందు.. కాంగ్రెస్ పార్టీ చతికిలపడి ఎన్నేండ్లయిందో ఆలోచించుకోవాలన్నారు.

