వ్యవసాయంలో రసాయన ఎరువులను తగ్గిద్దాం : వ్యవసాయ శాఖ

వ్యవసాయంలో  రసాయన ఎరువులను తగ్గిద్దాం : వ్యవసాయ శాఖ
  • సహజ సాగుపై రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన
  • నేల స్వభావం దెబ్బతినకుండా, దిగుబడి పెంచేలా చర్యలు 
  • పంటలకు అవసరమయ్యే కీటకాల పెంపుపై అవెర్నెస్‌‌
  • నేల ఆరోగ్య పరిరక్షణతోనే స్థిరమైన దిగుబడులు 
  • సహజ వ్యవసాయానికి మాన్యువల్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం తగ్గింపుపై రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన కల్పించనుంది. నేల స్వభావం దెబ్బతినకుండా, దీర్ఘకాలికంగా పంట దిగుబడులను పెంచే లక్ష్యంతో సహజ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. కృత్రిమ ఎరువుల తగ్గింపునకు చర్యల్లో భాగంగా రైతు వేదికల ద్వారా నేల ఆరోగ్యం, మైక్రోబ్స్ పాత్ర, సహజ ఎరువులు, శిలీంధ్రాలు, పంటలకు మేలు చేసే కీటకాల పెంపకం వంటి అంశాలపై నిపుణులతో రైతులకు అవెర్నెస్‌‌ కల్పించనుంది. 

ఈ విధానం ద్వారా నేల సారం మెరుగుదల, నీటి వినియోగ సమర్థత, ఉత్పత్తి ఖర్చుల తగ్గింపు, పర్యావరణ కాలుష్య నివారణ,- కార్బన్ నిల్వ పెరుగుదల వంటి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని రైతులకు నిపుణులు వివరించనున్నారు. ఇది సుస్థిర వ్యవసాయానికి, వాతావరణ మార్పులకు తట్టుకునే సాగు విధానాలకు దోహదం చేయనుంది. ఈ అవగాహన కార్యక్రమాలతో పర్యావరణ సమతుల్యతతో పాటు పెట్టుబడి తగ్గి స్థిరమైన వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేస్తారని అగ్రికల్చర్ అధికారులు అంటున్నారు.

రసాయన ఎరువుల తగ్గింపు అవసరం..

అధిక రసాయన ఎరువుల వినియోగంతో నేలలోని పోషకాలు క్షీణించి, సాయిల్ లీచింగ్ (నీటితో కలిసిపోవడం) ప్రమాదం పెరుగుతుందని నిపుణులు రైతులను సూచించనున్నారు. నత్రజని, పొటాష్, కాల్షియం, మేగ్నీషియం వంటి పోషకాలు వర్షాలు, అధిక నీటి పారుదలతో భూగర్భ జలాల్లోకి కలిసి నేల కాలుష్యాన్ని సృష్టిస్తాయి. సహజ సాగులో మైక్రోబ్స్, మైకోరైజా శిలీంధ్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి నేలలోని పోషకాలను విడదీసి మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. సాయిల్ టెస్ట్‌‌ల ఆధారంగా పోషకాలు, సేంద్రియ ఎరువులు, మల్చింగ్, కవర్ క్రాప్స్, డ్రిప్ ఇరిగేషన్ వంటి పద్ధతులు అనుసరించాలని రైతులకు సలహా ఇవ్వనున్నారు. 

తాజాగా కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నేచరల్ ఫార్మింగ్‌‌పై టెక్నికల్ మాన్యువల్‌‌ను విడుదల చేసింది. ఈ మాన్యువల్ రసాయన రహిత సాగుకు శాస్త్రీయ ఆధారాలను అందించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, సంప్రదాయ సాగును ఆధారంగా చేసుకొని, పశుపోషణను అనుసంధానించి సాగు విధానం రూపొందించారు. ఇది మట్టి సారాన్ని పెంచడం, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, పంటల వైవిధ్యాన్ని పెంపొందించడం, రైతు కుటుంబాల ఆహార భద్రతను బలోపేతం చేయడం వంటి అనేక ప్రయోజనాలను కలిగించనుందని పేర్కొంది.

సహజ సాగుకు కీలక సూత్రాలు..

కేంద్ర మంత్రిత్వ శాఖ మాన్యువల్‌‌లో మట్టిలో సేంద్రియ పదార్థం పెంచడం, దున్నడం, పంటల వైవిధ్యం,- -పశుపోషనణ అనుసంధానం, సహజ పద్ధతుల్లో పురుగుల నియంత్రణ,- పంట పొలాల్లో తయారు చేసే జీవ పదార్థాల వినియోగం,- స్థానిక విత్తనాలు ఉపయోగించాలని సూచించింది. ఇవన్నీ మట్టిలో సూక్ష్మజీవుల (మైక్రోబ్స్) క్రియాశీలతను పెంచి, నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచి, వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతాయని నిపుణులు తెలిపారు. రైతులకు జీవామృతం, ఘన జీవామృతం, బీజామృతం తయారీ, వినియోగం, మల్చింగ్, కవర్ క్రాప్స్,- పంటల మార్పిడి,- మిశ్రమ పంటలు, పురుగుల నియంత్రణకు నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి కషాయం వంటి సహజ కీటకనాశక ద్రావణాల తయారీ విధానాలను వివరించారు. 

సంప్రదాయ విత్తనాలు ఉపయోగించి, బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం ద్వారా మొలకెత్తే శాతం, మొక్కల బలాన్ని పెంచవచ్చని సూచించారు. జన్యుమార్పిడి విత్తనాలను సహజ వ్యవసాయంలో ఉపయోగించరాదని స్పష్టం చేశారు. ఈ అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించనున్నారు.