రాష్ట్రంలో 58 శాతం జనాభాకు వ్యవసాయమే ఆధారం :  మంత్రి నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలో 58 శాతం జనాభాకు వ్యవసాయమే ఆధారం :  మంత్రి నిరంజన్ రెడ్డి

గండిపేట, వెలుగు: రాష్ట్రంలో 58 శాతం జనాభాకు వ్యవసాయమే ఆధారమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి తెలిపారు. సుస్థిర వ్యవసాయానికి తెలంగాణ బ్రాండ్​గా మారిందని.. రైతుబంధు, రైతు బీమా, సాగునీరు, నిరంతర విద్యుత్, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రాజేంద్రనగర్​లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ ఆడిటోరియంలో రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. చీఫ్​గెస్టుగా హాజరైన మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు రాజేంద్రనగర్​లోని అగ్రికల్చర్ కాలేజీలో చదవాలని కోరిక ఉండేదని.. కానీ అప్పుడు సీటు రాలేదన్నారు. 

ప్రస్తుతం మంత్రి హోదాలో వర్సిటీకి వస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రాంతానికి, భూమికి విడదీయరాని బంధం ఉందని ఆయన చెప్పారు. అనంతరం ఉత్తమ రైతులకు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, వ్యవసాయ శాఖ కార్యదర్శి, అగ్రికల్చర్ వర్సిటీ  ఇన్​చార్జి వీసీ రఘునందన్ రావు, హార్టికల్చర్ కమిషనర్ హనుమంత రావు,  వర్సిటీ ఇన్ చార్జి రిజిస్ట్రార్, రీసెర్చ్ డైరెక్టర్ వెంకటరమణ, ఫ్యాకల్టీ, అధికారులు, సైంటిస్టులు, స్టూడెంట్లు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే లక్ష్యం: మంత్రి తలసాని 

సికింద్రాబాద్: రైతును రాజు చేయాలన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని..  అందుకే రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోయిన్​పల్లి మార్కెట్ యార్డులో నిర్వహించిన రైతు దినోత్సవానికి  చీఫ్​గెస్టుగా హాజరైన మంత్రి తలసాని మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉండాలన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక గౌడ్, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్ తదితరులు పాల్గొన్నారు. 

రైతులకు భోజనం వడ్డించిన మంత్రి సబితరంగారెడ్డి:  రైతులకు సర్కారు అండగా ఉంటుందని మంత్రి సబితా రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచర్ల గ్రామంలోని రైతు వేదికలో రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. చీఫ్ గెస్టుగా హాజరైన మంత్రి సబిత రైతులకు భోజనం వడ్డించారు. తర్వాత వారితో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ హరీశ్, అధికారులు పాల్గొన్నారు.