- ఏఐ, డ్రోన్లు, ఐఓటీ, రోబోటిక్స్‌తో కొత్తతరం అగ్రికల్చర్ విద్య
- ప్రాబ్లమ్స్ టు ప్రొడక్ట్స్ టు స్టార్టప్స్ దిశగా సరికొత్త నైపుణ్యాలు
- విద్యార్థుల నుంచి ఆదరణ
- పరిశోధనలు, ఆవిష్కరణల సమ్మేళనంగా అగ్రి కోర్సులు
- ఉత్పత్తి వ్యయం తగ్గించి, దిగుబడులు పెంచడమే లక్ష్యంగా విద్యా విధానం
హైదరాబాద్, వెలుగు: సంప్రదాయ వ్యవసాయం నుంచి సాంకేతిక ఆధారిత వ్యవసాయం అగ్రిటెక్ వైపు దేశం వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో వ్యవసాయ విద్యలోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేవలం పంటల సాగు, నేల, నీటి యాజమాన్యం వంటి అంశాలకే పరిమితం కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, డేటా అనలిటిక్స్, బయోటెక్నాలజీ, అగ్రి బిజినెస్, స్టార్టప్‌లు వంటి అత్యాధునిక రంగాలను వ్యవసాయ విద్యలో భాగం చేస్తున్నారు.
దీంతో వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలు కనిపిస్తుండగా, యువత అగ్రికల్చర్ కోర్సులపై ఆసక్తి చూపుతోంది. జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలకు అనుగుణంగా దేశంలో కొత్త తరహా అగ్రిటెక్ ఇన్నోవేషన్ యూనివర్సిటీలు ఏర్పడుతున్నాయి. వ్యవసాయాన్ని జ్ఞాన ఆధారిత, ఆవిష్కరణలతో కూడిన రంగంగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యాసంస్థలు పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌లు, ఇంక్యుబేషన్ కేంద్రాలతో అనుసంధానమై పనిచేస్తున్నాయి. వ్యవసాయాన్ని కేవలం సంప్రదాయ వృత్తిగా కాకుండా.. శాస్త్ర సాంకేతికత, ఆవిష్కరణలు, పారిశ్రామిక అవకాశాల సమ్మేళనంగా తీర్చిదిద్దే దిశగా అగ్రిటెక్ విద్య కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. దీంతో భవిష్యత్ వ్యవసాయం మరింత స్మార్ట్‌గా, లాభదాయకంగా, సుస్థిరంగా మారుతుందనే అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సమస్యల నుంచి టెక్నికల్ ఉత్పత్తుల దిశగా..
వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిశోధనల ద్వారా పరిష్కారాలు కనుగొని.. వాటిని సాంకేతిక ఉత్పత్తులుగా మార్చి, స్టార్టప్‌ల రూపంలో రైతులకు అందించడమే ఈ కొత్త విద్యా విధానంలో ప్రధాన లక్ష్యంగా మారుతోంది. ‘ప్రాబ్లమ్స్ టు ప్రొడక్ట్స్ టు స్టార్టప్స్’ అనే విధానంతో విద్యార్థులు చదువుకునే దశలోనే పరిశోధనలు, ఆవిష్కరణలు, పారిశ్రామిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ దిశలో అగ్రికల్చర్, హార్టీకల్చర్ వర్సిటీలు టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
ఏఐ, డ్రోన్ల, రోబోల వినియోగం
ప్రస్తుత వ్యవసాయ రంగంలో డ్రోన్లు, రోబోల ద్వారా పంటల పరిశీలన, ఎరువులు, పురుగు మందుల పిచికారీ, పంటల ఆరోగ్య విశ్లేషణ, దిగుబడి అంచనాలు, శాటిలైట్ చిత్రాల విశ్లేషణ వంటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఏఐ సాయంతో వాతావరణ పరిస్థితులు, నీటి అవసరం, పంటకు సోకే వ్యాధుల హెచ్చరికలు, మార్కెట్ ధరల అంచనాలు రైతులకు ముందుగానే తెలియజేసే వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ టెక్నాలజీని నిర్వహించగల మానవ వనరులను తయారు చేయడంపైనే పలు అగ్రి వర్సిటీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగా అగ్రిటెక్ విద్యకు అవసరమైన ఆధునిక పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ముందుకెళ్తున్నాయి. ప్రెసిషన్ ఫార్మింగ్, డ్రోన్ టెక్నాలజీ, ఐఓటీ ఆధారిత వ్యవసాయం, స్మార్ట్ ఇరిగేషన్, డిజిటల్ ఫార్మింగ్ వంటి రంగాల్లో పరిశోధనలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రయోగశాలలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. రైతులు, విద్యార్థులు, పరిశోధకులకు సాంకేతిక శిక్షణ అందించే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి.
ఉపాధి కల్పించే దిశగా...
గతంలో వ్యవసాయ విద్య పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు, పరిశోధనా సంస్థలకే పరిమితమయ్యేవారు. ప్రస్తుతం అగ్రిటెక్ స్టార్టప్‌లు, అగ్రి కన్సల్టెన్సీ, డ్రోన్ సర్వీసులు, ప్రెసిషన్ ఫార్మింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, డిజిటల్ అగ్రికల్చర్, అగ్రి ఫిన్‌టెక్, అగ్రి డేటా అనలిటిక్స్, సరఫరా గొలుసు నిర్వహణ వంటి రంగాల్లో విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఉద్యోగాలకే కాకుండా స్వయం ఉపాధి, స్టార్టప్‌ల స్థాపనకు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.
పలు యూనివర్సిటీలు వ్యవసాయంతో పాటు ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, డేటా సైన్స్ వంటి విభాగాలను అనుసంధానం చేస్తూ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరల్, పోస్ట్ డాక్టరల్ కోర్సులను అందిస్తున్నారు. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రపంచ స్థాయి నైపుణ్యాలను విద్యార్థులకు అందిస్తున్నారు. మరోవైపు, అగ్రిటెక్ విద్య లక్ష్యం కేవలం విద్యార్థులను తయారు చేయడం మాత్రమే కాదు. యూనివర్సిటీల్లో అభివృద్ధి చేసిన టెక్నాలజీని రైతుల వరకు చేర్చడం, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వ్యవసాయాన్ని విస్తరించడం, దిగుబడులు పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దడం వంటి అంశాలపైనా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు.
భవిష్యత్ వ్యవసాయానికి అగ్రిటెక్నే బాట..
రానున్న దశాబ్దంలో వ్యవసాయ రంగంలో అత్యధిక మార్పులు టెక్నాలజీ ద్వారానే చోటుచేసుకోనున్నాయని టెక్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఏఐ, ఐఓటీ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ, డిజిటల్ ప్లాట్ఫార్మ్లు, ఆటోమేషన్ వంటి సాంకేతికత వ్యవసాయాన్ని పూర్తిగా మార్చనున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ విద్యను కూడా ఆధునీకరిస్తేనే ప్రపంచస్థాయిలో పోటీపడే నైపుణ్యం విద్యార్థులకు లభిస్తుందని ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పటి వరకు అగ్రికల్చర్ రంగంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పాలీహౌజ్‌లు, షేడ్ నెట్, డ్రిప్, స్ప్రింక్లర్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం సరికొత్త టెక్నాలజీ అందించే విద్యను యువతరానికి అందించేలా ప్రయత్నాలకు ఊపందుకుంటున్నాయి. దీంతో భవిష్యత్తులో వ్యవసాయ రంగం అగ్రి టెక్నాలజీ రంగంగా అభివృద్ధి సాధించే పరిస్థితులు కనిపించనున్నాయి.
