- ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సామ్రాజ్యవాద అనుకూల ఒప్పందాలతో తీవ్ర నష్టం కలుగుతోందని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూకృష్ణన్ చెప్పారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం ‘భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందాలు–వ్యవసాయ రంగంపై ప్రభావాలు’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు.
అమెరికాతో ఒప్పందాన్ని తిప్పికొట్టకపోతే రైతులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి ఏర్పడుతోందన్నారు. అమెరికాకు ఎగుమతి చేసే వాటికి 18 శాతం పన్ను కడుతుండగా.. అక్కడి నుంచి దిగుమతి చేసుకునే వాటికి పన్ను ఉండడం లేదన్నారు. విదేశీ ఒప్పందాలతో భారతీయ రైతులకు తీవ్ర నష్టం కలగనుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్ట్ 9 నుంచి సేవ్ ఇండియా మూవ్‌మెంట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
క్విట్ కార్పొరేట్ నినాదంతో మూడు నెలల పాటు ఉద్యమాలు చేపట్టనున్నామన్నారు. దేశంలో ఉత్పత్తి పెరుగుతున్నా.. ప్రజల కొనుగోలు శక్తి పడిపోతోందని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు సీపీఎం అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ యూనివర్శిటీ వీసీ జానయ్య, నాయకులు పోతినేని సుదర్శన్, టి.సాగర్, మల్లారెడ్డి, కందాల ప్రమీల, శోభన్‌నాయక్ పాల్గొన్నారు.

