రీసెర్చ్​ రిపోర్ట్ : వంటింటి పొగ 8 లక్షల మందిని చంపుతోంది

రీసెర్చ్​ రిపోర్ట్ : వంటింటి పొగ 8 లక్షల మందిని చంపుతోంది

న్యూఢిల్లీ: మహిళల కష్టాన్ని, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ఓ గొప్ప ముందడుగని తాజా రీసెర్చ్​ఒకటి వెల్లడించింది. అయితే ఈ పథకం పూర్తిస్థాయిలో సక్సెస్​కాలేదని పేర్కొంది. దేశవ్యాప్తంగా 8 కోట్ల పైగా కుటుంబాలకు ఈ పథకం కింద ఎల్పీజీ కనెక్షన్​ఉచితంగా ఇచ్చామని బీజేపీ చెబుతున్నా.. ఇప్పటికీ 16 కోట్ల కుటుంబాలు వంట చెరుకును ఉపయోగిస్తున్నట్లు తేలింది. దీంతో వాయు కాలుష్యం పెరిగి ఏటా లక్షలాది మంది మృత్యువాత పడుతున్నారని పేర్కొంది. వంటింటి కాలుష్యాన్ని అరికట్టాలంటే మోడీ సర్కారు చేయాల్సింది ఇంకా చాలా ఉందని తెలిపింది. కొలాబరేటివ్​క్లీన్​ఎయిర్​పాలసీ సెంటర్ తో కలిసి కాలిఫోర్నియా, కార్నెల్, మాక్స్​ప్లాంక్, ఐఐటీ ఢిల్లీ కలిసికట్టుగా ఈ రీసెర్చ్​జరిపాయి.

ఇండియాలో వాయు కాలుష్య మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని తేల్చిచెప్పాయి. అందులోనూ వంటింటి నుంచి వెలువడే పొగ కారణంగానే ఎక్కువ మంది చనిపోతున్నారని వెల్లడించాయి. ఏటా వాయు కాలుష్యం వల్ల దేశంలో 11 లక్షల మంది చనిపోతుండగా.. వంటింటి పొగ వల్లే అందులో 8 లక్షల(80 శాతం) మంది మరణిస్తున్నారని పేర్కొన్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం(జూన్​5) ఈ రిపోర్టును వెల్లడించాయి.

వంట చెరుకే మొదటి ముద్దాయి..

వంట కోసం కట్టెలు, చెట్ల ఆకులు, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించడం వల్ల పెద్ద మొత్తంలో కాలుష్యం విడుదల అవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. వాహనాల నుంచి వెలువడే పొగకన్నా వంటచెరుకు కారణంగా వెలువడే పొగే ఎక్కువ ప్రమాదకరమని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ పొగలో పీఎం లెవల్స్​2.5 కన్నా ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఇది గాలిలో కలిసి కాలుష్య తీవ్రతను మరింత పెంచుతోందని వివరించారు. దీంతో మహిళల ప్రాణాలకు రిస్క్​తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఢిల్లీ నుంచి గల్లీ దాకా..

మెట్రోపాలిటన్​సిటీల్లో వంటింటి కాలుష్యం కన్నా నిర్మాణ పనుల్లో వెలువడే దుమ్ము, వాహనాల నుంచి విడుదలయ్యే పొగ తీవ్రత ఎక్కువ.. ఢిల్లీలోనూ వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. మిగతా చోట్ల వంటింటి పొగే ఎక్కువని, ముఖ్యంగా బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, చత్తీస్​గఢ్, అస్సాం రాష్ట్రాల్లో ఇప్పటికీ 72 శాతం మంది వంట చెరుకునే ఉపయోగిస్తారని  ఈ రిపోర్టు వెల్లడించింది.

ఉసురుతీస్తున్న వాయు కాలుష్యం

ఎయిర్‌‌ పొల్యూషన్‌‌  దేశాన్ని భయపెడుతోంది.  కంట్రోల్‌‌పై దృష్టిపెట్టకుంటే దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదని సర్వేలు వార్నింగ్‌‌ ఇస్తున్నాయి. ఈ పొల్యూషన్‌‌ వల్ల దేశంలో ఏటా లక్ష మంది చిన్నారులు చనిపోతున్నారని సెంటర్‌‌ ఫర్‌‌ సైన్స్‌‌ అండ్‌‌ ఎన్విరాన్‌‌మెంట్‌‌  (సీఎస్‌‌ఈ) సంస్థ  లేటెస్ట్‌‌గా హెచ్చరించింది.  చనిపోతున్నవాళ్లంతా ఐదేళ్లలోపు  పిల్లలు కావడం విశేషం.  దేశంలో  చోటుచేసుకుంటున్న మరణాల్లో  12.5 శాతం గాలి కాలుష్యం వల్లేనని సీఎస్‌‌ఈ వెల్లడించింది. వరల్డ్‌‌ ఎన్విరాన్‌‌మెంట్‌‌ డే సందర్భంగా  న్యూఢిల్లీకి చెందిన  నాన్‌‌ ప్రాఫిట్‌‌ సంస్థ ..సీఎస్‌‌ఈ తాను చేసిన సర్వేను  రిలీజ్‌‌ చేసింది. ప్రతి 10 వేల మంది చిన్నారుల్లో ఏవరేజ్‌‌న 8.5 మంది ఐదేళ్లు నిండకుండానే కన్నుమూస్తున్నారని  తేల్చింది.  అబ్బాయిలకన్నా అమ్మాయిల్లోనే ఈ రిస్క్‌‌ ఎక్కువగా ఉందని  తెలిపింది.

ప్రతి 10 వేల మంది అమ్మాయిల్లో 9.6 మంది పొల్యూషన్‌‌  బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని  పేర్కొంది.  ఎయిర్‌‌ పొల్యూషన్‌‌ వల్ల గత ఏడాది దేశంలో లక్ష 20 మంది చనిపోయినట్టు గ్లోబల్‌‌ రిపోర్టులు చెప్పాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన  రాజధాని న్యూఢిల్లీ అని గ్రీన్‌‌ పీస్‌‌ రిపోర్ట్‌‌  ప్రకటించింది. ఇంతకుముందు మోడీ సర్కార్‌‌లో పర్యావరణ మంత్రిగా పనిచేసిన హర్షవర్థన్‌‌ మాత్రం  ఈ రిపోర్ట్‌‌లను తప్పుపట్టారు. ప్రజల్లో భయాందోళనల్ని కలిగించడమే ఈ స్టడీస్‌‌ ముఖ్యోద్దేశమని, అవన్నీ అబద్ధాలు పుట్టలని కొట్టిపారేశారు.