చిమ్మచీకట్లో.. Mi 17 హెలికాప్టర్‌లో…

చిమ్మచీకట్లో.. Mi 17 హెలికాప్టర్‌లో…

ఎయిర్ ఫోర్స్ Mi 17లో గర్భిణి తరలింపు

కర్ణాటకలో వరద బీభత్సం కొనసాగుతోంది. రాయ్ చూర్, బెళగావి, కొడగు, బాగల్ కోడ్, విజపుర, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, యాద్గిర్, శివమొగ్గ, చిక్ మగళూరు జిల్లాల్లో భారీవర్షాలు, వరద జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే సుమారు 2.5లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు భద్రతా సిబ్బంది. పడవలు, హెలికాప్టర్లలో వరద బాధితులను తరలిస్తూ సహాయం చేస్తున్నారు.

ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ జవాన్లు… వరద బాధిత ప్రాంతాల్లో నిరంతరం సహాయం అందిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో కరెంట్ లేకపోవడంతో రాత్రివేళ… చిమ్మచీకట్లోనూ.. అలుపు లేకుండా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. సహాయం కోసం అర్థిస్తున్నవారిని దేవుడిలా కాపాడుతున్నారు.

నారాయణపూర్ డ్యామ్ బ్యాక్ వాటర్ తో మునిగిన పల్లెల్లో వరద బాధితులను నిన్న రాత్రి ఎయిర్ ఫోర్స్ సాహసోపేతంగా లిఫ్ట్ చేసింది. ఆరుగురు సభ్యులున్న ఓ పేద కుటుంబాన్ని… ఎయిర్ ఫోర్స్ Mi 17 మల్టీ ట్రాన్స్ పోర్ట్ వాహనంలో లిఫ్ట్ చేశారు. అందులో ఓ గర్భిణి కూడా ఉంది. అత్యంత జాగ్రత్తగా ప్రెగ్నెంట్ ఉమన్ ను హెలికాప్టర్లో ఎక్కించారు జవాన్లు. ఆ తర్వాత… ఎయిర్ ఫోర్స్ మెడికల్ ఆఫీసర్.. ఆమెకు హెలికాప్టర్లో ఉండగానే అవసరమైన వైద్యం అందించారు. తమ కూతురును కాపాడి వైద్యం అందించిన జవాన్లకు ఆ కుటుంబం చేతులెత్తి నమస్కరించింది. ల్యాండింగ్ తర్వాత.. దగ్గర్లోని ఓ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించింది రెస్క్యూ టీమ్.