
దేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే 5జీ సేవల్ని విస్తరించిన భారతీ ఎయిర్టెల్... ఇప్పుడు వరంగల్, కరీంనగర్ లో కూడా సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. వీటితో పాటు విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, గుంటూరు, తిరుపతి నగరాల్లో ఈ రోజు నుంచి 5జీ సేవలు ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఎయిర్టెల్ 5జీ సేవలు హైదరాబాద్. వైజాగ్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సంస్థ తన నెట్ వర్క్ ను విస్తరిస్తున్నందున ఎయిర్టెల్ 5జీ ప్లస్ సేవలు దశల వారీగా అందుబాటులో రానున్నాయి. ప్రస్తుతం 4జీ సిమ్ ద్వారానే 5జీ సేవలను పొందవచ్చని ఎయిర్టెల్ ప్రకటించింది. జియో 5జీ కన్నా ఎయిర్టెల్ 5జీ సేవలే మెరుగ్గా ఉన్నా దేశంలో విస్తరణపరంగా జియో 5జీనే ముందుంది. ఇప్పటికే దాదాపు 110 నగరాల్లో కస్టమర్లు జియో 5జీ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు.