మార్కెట్ విలువలో HDFCని దాటేసిన ఎయిర్‌టెల్.. దేశంలోనే నెం-2 సంస్థతో రికార్డ్

మార్కెట్ విలువలో HDFCని దాటేసిన ఎయిర్‌టెల్.. దేశంలోనే నెం-2 సంస్థతో రికార్డ్

భారత స్టాక్ మార్కెట్‌లో ఒక సరికొత్త రికార్డ్ నమోదైంది. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీను వెనక్కి నెట్టి దేశంలోనే 2వ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. మే 18న ఎయిర్‌టెల్ షేర్లు 2 శాతం లాభపడి రూ.1,953.8 వద్ద ట్రేడ్ అవ్వడంతో.. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.12 లక్షల కోట్లకు చేరుకుంది. అదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.11.8 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుతం రూ.18.04 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా 1వ స్థానంలో కొనసాగుతోంది.

గడిచిన వారంలో ఎయిర్‌టెల్ షేర్లు 10 శాతం పుంజుకోగా.. హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు కేవలం 1 శాతం మాత్రమే పెరిగాయి. పైగా హెచ్‌డీఎఫ్‌సీ పార్ట్-టైమ్ ఛైర్మన్ అటాను చక్రవర్తి రాజీనామా చేయడంతో ఆ బ్యాంక్ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. గత 6 నెలల్లో హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 22 శాతం మేర విలువను కోల్పోయాయి.

►ALSO READ | ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్ ఆఫ్ ఇండియా.. సీనియర్ సిటిజన్లకు భారీ లాభాలు

ఇక భారతీ ఎయిర్‌టెల్ విషయానికి వస్తే.. 2026 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 33.5 శాతం తగ్గి రూ.7వేల 325 కోట్లుగా నమోదైంది. అయితే వ్యాపార ఆదాయం మాత్రం గతేడాదితో పోలిస్తే 15.6 శాతం పెరిగి రూ.55వేల 383 కోట్లకు చేరింది. ఎయిర్‌టెల్ తన కస్టమర్ల నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని రూ.245 నుంచి రూ.257కు పెంచుకోగలిగింది.

భవిష్యత్ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌టెల్ రాబోయే 18-24 నెలల్లో 56 ఎడ్జ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. డేటా సెంటర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంతో పాటు ఇటీవల ప్రకటించిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో రూ.20వేల కోట్లతో భారీ పెట్టుబడులు పెట్టాలని ఈ టెలికాం కంపెనీ నిర్ణయించింది.