కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్రం : ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్రం : ఏఐటీయూసీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్

వనపర్తి, వెలుగు: కేంద్ర ప్రభుత్వానికి కార్మికులు శత్రువులుగా, కార్పొరేట్ శక్తులు మిత్రులుగా మారారని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్ విమర్శించారు. ఏఐటీయూసీ వనపర్తి జిల్లా నాలుగో మహాసభలు గురువారం పెబ్బేరు మండలకేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కార్మికులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలరాజ్ మాట్లాడుతూ.. బ్రిటీష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్‌‌‌‌‌‌‌‌లుగా తీసుకువచ్చి బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను దెబ్బతీస్తోందని ఆరోపించారు. 

లేబర్ కోడ్‌‌‌‌‌‌‌‌లు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, కార్మికులను కట్టుబానిసలుగా మార్చేలా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో 12 ఏళ్లుగా కనీస వేతనాలు పెరగలేదని, ఇటీవల ప్రకటించిన పెంపు కూడా కనీస వేతన బోర్డు సిఫారసులకు విరుద్ధంగా ఉందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, నాయకులు మోష, శ్రీరాములు పాల్గొన్నారు.