వాంఖడేలో రఫ్ఫాడించిన అజింక్యా రహానె

వాంఖడేలో రఫ్ఫాడించిన అజింక్యా రహానె

ముంబై:   టీమిండియాకు దూరమైన సీనియర్‌‌‌‌ బ్యాటర్‌‌ అజింక్యా రహానె (27 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 61) ఐపీఎల్‌‌16లో చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌ తరఫున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న రహానె వాంఖడేలో రఫ్ఫాడించాడు. అతనికి తోడు స్పిన్నర్లు జడేజా (3/20), శాంట్నర్‌‌ (2/28) తిప్పేయడంతో  శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌లో సీఎస్కే7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌‌ను చిత్తు చేసింది. ముంబై వరుసగా రెండో ఓటమి ఖాతాలో వేసుకుంది. ఈ వన్‌‌సైడ్‌‌ పోరులో తొలుత ముంబై 20 ఓవర్లో 157/8 స్కోరు మాత్రమే చేసింది. ఇషాన్ కిషన్ (21 బాల్స్‌‌లో 5 ఫోర్లతో 32), టిమ్‌‌ డేవిడ్‌‌ (22 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 2 సిక్సర్లతో 31) ఫర్వాలేదనిపించారు. తర్వాత సీఎస్కే 18.1 ఓవర్లలోనే 159/3 స్కోరు  చేసి ఈజీగా గెలిచింది. రుతురాజ్‌‌ గైక్వాడ్​ (40 నాటౌట్‌‌ ) కూడా రాణించాడు. జడేజాకు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. 

అంజిక్యా అదుర్స్‌‌

టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో రహానె ఖతర్నాక్‌‌ బ్యాటింగ్‌‌తో మ్యాచ్‌‌ను వన్​సైడ్​ చేశాడు. ఇన్నింగ్స్‌‌ నాలుగో బాల్‌‌కే చెన్నై ఓపెనర్‌‌ కాన్వే (0)ను బెరెండార్ఫ్‌‌ డకౌట్‌‌ చేసినా.. పవర్‌‌ప్లేలో రహానె పవర్‌‌ ఫుల్‌‌ షాట్లు కొట్టాడు.  ఓ ఎండ్‌‌లో గైక్వాడ్‌‌ను నిలబెట్టి టాప్‌‌ క్లాస్‌‌ ఆట చూపెట్టాడు. బెరెండార్ఫ్‌‌ వేసిన మూడో ఓవర్లో డీప్‌‌ ఫైన్‌‌లెగ్ మీదుగా సూపర్ సిక్స్‌‌ కొట్టిన అతను.. అర్షద్‌‌ వేసిన 4వ ఓవర్లో 6, 4, 4, 4, 4తో ఏకంగా 23 రన్స్‌‌ రాబట్టడంతో స్టేడియం హోరెత్తింది. గ్రీన్‌‌ బౌలింగ్‌‌లో సిక్స్‌‌, స్పిన్నర్‌‌ పీయుష్‌‌ చావ్లా ఓవర్లో 4, 4 తో 2020 తర్వాత ఐపీఎల్‌‌లో ఫస్ట్‌‌ హాఫ్​ సెంచరీని కేవలం19 బాల్స్‌‌లోనే పూర్తి చేశాడు. ఐపీఎల్‌‌లో సీఎస్కేకు ఇదే ఫాస్టెస్ట్‌‌ ఫిఫ్టీ కావడం విశేషం. తన తర్వాతి ఓవర్లోనే రహానెను చావ్లా ఔట్‌‌ చేయడంతో రెండో వికెట్‌‌కు 82 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. క్రీజులో కుదురుకున్న గైక్వాడ్‌‌కు తోడైన శివం దూబే (28) వచ్చీరాగానే రెండు ఫోర్లు సాధించగా 11 ఓవర్లకే స్కోరు వంద దాటింది. గైక్వాడ్‌‌తో మూడో వికెట్‌‌కు 43 రన్స్‌‌ జోడించిన తర్వాత దూబే ఔటయ్యాడు. అప్పటికి చెన్నైకి 33 రన్స్‌‌ అవసరం అయ్యాయి. ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌గా వచ్చిన రాయుడు (20 నాటౌట్‌‌), గైక్వాడ్‌‌ జట్టును గెలిపించారు.

ముంబై తడబాటు..

ఎప్పట్లానే ఐపీఎల్‌‌ కొత్త సీజన్‌‌ను ఓటమితో ఆరంభించిన ముంబై సొంతగడ్డపై మొదటి మ్యాచ్‌‌లోనూ నిరాశ పరిచింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ముంబైకి మంచి ఆరంభమే లభించినా.. మధ్యలో స్పిన్నర్లు జడేజా, శాంట్నర్ దెబ్బకు వరుస వికెట్లు కోల్పోయి చిన్న స్కోరుకే పరిమితమైంది. తొలుత ఓపెనర్లు ఇషాన్‌‌ కిషన్‌‌, రోహిత్‌‌ (21) ఫస్ట్‌‌ వికెట్‌‌కు 38 రన్స్‌‌ జోడించారు. తుషార్‌‌ (2/31) వేసిన నాలుగు ఓవర్లో పాయింట్‌‌ మీదుగా సిక్స్‌‌ కొట్టిన రోహిత్‌‌ లాస్ట్ బాల్‌‌కు  బౌల్డ్‌‌ అయ్యాడు.  ఆపై మగాల బౌలింగ్‌‌లో ఇషాన్‌‌ రెండు ఫోర్లు రాబట్టడంతో పవర్‌‌ప్లేను ముంబై 61/1తో ముగించింది. కానీ, స్పిన్నర్ల ఎంట్రీతో సీన్‌‌ మారింది. ఏడో ఓవర్లో ఇషాన్‌‌ను జడేజా ఔట్‌‌ చేయగా.. శాంట్నర్‌‌ బౌలింగ్‌‌లో ధోనీ చురుకైన క్యాచ్‌‌తో పాటు డీఆర్‌‌ఎస్‌‌తో సూర్యకుమార్‌‌ (1) వెనుదిరిగాడు. గ్రీన్‌‌ (12), అర్షద్‌‌ ఖాన్‌‌ (2) కూడా ఫెయిలవడంతో 76/5తో ముంబై కష్టాల్లో పడ్డది. ఈ టైమ్‌‌లో గత మ్యాచ్‌‌ హీరో తిలక్‌‌ వర్మ (22) రెండు ఫోర్లు, సిక్స్‌‌తో కుదురుకున్నట్టే కనిపించినా.. జడేజా బౌలింగ్‌‌లో వికెట్లముందు దొరికిపోయాడు. సీఎస్కే బౌలర్లు ఒత్తిడి పెంచడంతో వరుసగా మూడు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా రాలేదు. 16 ఓవర్లో ట్రిస్టాన్‌‌ స్టబ్స్‌‌ (5)ను మగాల పెవిలియన్‌‌ చేర్చాడు. అప్పటిదాకా సింగిల్సే తీసిన టిమ్‌‌ డేవిడ్‌‌.. దేశ్‌‌పాండే వేసిన 17 ఓవర్లో 6, 4, 6తో చెలరేగి తర్వాతి బాల్‌‌కే రహానెకు క్యాచ్‌‌ ఇచ్చాడు. చివరి ఓవర్లో  హృతిక్‌‌ షోకీన్‌‌ (18 నాటౌట్‌‌) 3 ఫోర్లు రాబట్టడంతో ముంబై స్కోరు 150 దాటింది.