త్వరలోనే ఉప్పల్ స్కైవాక్ ప్రారంభం..ప్రత్యేకతలివే..

త్వరలోనే ఉప్పల్ స్కైవాక్ ప్రారంభం..ప్రత్యేకతలివే..

హైదరాబాద్ : త్వరలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఉప్పల్ చౌరస్తా వద్ద పాదచారుల రక్షణ కోసం ఆకాశ వంతెన స్కైవాక్ అందుబాటులోకి రాబోతోంది. నలువైపుల రోడ్డు దాటేందుకు వీలుగా ఆకాశ వంతెన స్కైవాక్(బోర్డ్ వాక్)ను ప్రజానీకానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అందుబాటులోకి తీసుకురాబోతోంది. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. రాబోయే వంద సంవత్సరాలకు పైగా ప్రజానీకం సౌకర్యార్థం మనుగడలో ఉండే లక్ష్యంతో పాదచారుల వంతెన నిర్మిస్తున్నారు. ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో సుమారు వెయ్యి టన్నులకుపైగా స్ట్రక్చరల్ స్టీల్ వాడకంతో పూర్తి చేశారు.    

                                           

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ తూర్పు (ఈస్ట్) వైపు అభివృద్ధిని, పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని మూడేళ్ల క్రితం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ కు సూచించారు. ఆర్కిటెక్చర్లు, డిజైనర్లు, సీనియర్ ఇంజనీర్ల బృందానికి ఉప్పల్ సర్కిల్లో కొత్త ప్రాజెక్టు బాధ్యతలను మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ అప్పగించారు. వారు రూపొందించిన కొన్ని నమూనాల నుంచి ప్రస్తుత పాదచారుల వంతెన డిజైను ఎంపిక చేశారు. దాదాపు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో  ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను హెచ్ఎండీఏకు అప్పగించారు.

ఉప్పల్ చౌరస్తాలో రోడ్డు దాటే(రోడ్ క్రాసింగ్) సమయంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, ప్రమాదాలలో ఎక్కువ శాతం మహిళలు, పాఠశాల విద్యార్థులు గాయపడుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకుని.. అక్కడ పాదచారుల వంతెన నిర్మాణం శ్రేయస్కారమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే పాదచారుల వంతెన ప్రాజెక్టు పనుల నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏకు అప్పగించింది.  

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాదచారుల వంతెన నిర్మాణంలో  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, వైజాగ్ స్టీల్ తోపాటు జిందాల్ స్టీల్ కంపెనీలకు చెందిన స్ట్రక్చరల్ స్టీల్ ఉపయోగించారు. పాదచారుల వంతెన ప్రాజెక్టులో భాగంగా ప్రజలకు 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కిలేటర్లు అందుబాటులో ఉంటాయి.  మొత్తం 37 పిల్లర్లు, 660 మీటర్ల పొడవు, మూడు(3), నాలుగు(4), అరు(6) మీటర్ల వెడల్పు కలిగిన ఉప్పల్ స్కైవాక్ భూమిపై నుండి అరు(6) మీటర్ల ఎత్తులో ఉంటుంది. మొత్తం 660 మీటర్ల పొడవు కలిగిన పాదచారుల వంతెన బ్యూటీఫికేషన్ లుక్ కోసం పైభాగంలో కేవలం 40 శాతం మేరకు రూఫ్ కవరింగ్ ఏర్పాట్లు చేశారు. 

వాస్తవానికి 2020 ఏడాది చివరలో ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు పనులు మొదలైనప్పటికీ... రెండు సంవత్సరాల పాటు కోవిడ్ పరిస్థితుల కారణంగా జాప్యం జరిగింది. ప్రాజెక్టులో 90 శాతం మేరకు స్ట్రక్చరల్ స్టీల్ వాడకం ఉండడం, వెల్డింగ్ పనుల కోసం ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా నిర్ణీత కాలంలో ప్రాజెక్టు పనులు జరగలేదు. ఉప్పల్ స్కై వాక్ అందుబాటులోకి రావడం ద్వారా కాలిబాటన రోడ్డు దాటే పాదచారులు స్కైవాక్ ను వినియోగించడం వల్ల ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీ గా వాహనాల రాకపోకలకు అవకాశం కలుగుతుంది. లిఫ్టులు, మెట్ల మార్గాల పరిసరాల్లో హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ యంత్రాంగం మొక్కలు పచ్చిక బయలతో పచ్చదనాన్ని (గ్రీనరీ) పెంచుతుంది.