V6 News

పంజాగుట్ట పీఎస్ లో హైడ్రామా.. సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసిన న్యాయవాదికి ఆల్కహాల్ టెస్టు..

పంజాగుట్ట పీఎస్ లో హైడ్రామా.. సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసిన న్యాయవాదికి ఆల్కహాల్ టెస్టు..
  • కావాలనే చేస్తున్నారని సుబ్బారావు ఆగ్రహం..

పంజాగుట్ట, వెలుగు: పంజాగుట్ట పోలీస్​స్టేషన్​లో సోమవారం హైడ్రామా చోటు చేసుకుంది. రెండు రోజుల కింద మంగ్లీ తనను బెదిరిస్తున్నారని న్యాయవాది సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం, తర్వాత తనపై తప్పుడు ప్రచారం చేస్తూ వేధిస్తున్నాడని మంగ్లీ అతడిపై రిటర్న్​కంప్లయింట్​ఇవ్వడం తెలిసిందే. తాజాగా సోమవారం మరో నాటకీయ పరిణామం చోటు చేసుకున్నది. 

మంగ్లీపై ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని న్యాయవాది సుబ్బారావును పంజాగుట్ట పోలీసులు పిలిపించారు. దీంతో కొందరు బాధితులతో కలిసి ఆయన స్టేషన్​కు వచ్చారు. అయితే, ఈ సందర్భంగా సీఐ రామకృష్ణ సుబ్బారావుకు ఆల్కాహాల్​టెస్ట్​చేయాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో పోలీసులు బ్రీత్​ఎనలైజర్​తో సుబ్బారావును  పరీక్షించగా, 27 పాయింట్లు వచ్చాయి. దీంతో అతడిని పంపించివేశారు.  

బద్నాం చేయాలని చూస్తున్నరు : సుబ్బారావు 

‘నేను ఆదివారం రాత్రి మద్యం సేవించాను. అయినా, టెస్టులో నాకు వచ్చింది 27 పాయింట్లు మాత్రమే. నేను నిన్న రాత్రి తాగాను అని చెప్తున్నా పోలీసులు అత్యుత్సాహంతో నన్ను టెస్ట్​చేసి బద్నాం చేయాలని చూశారు. మైక్రోఫైనాన్స్​విషయంలో మంగ్లీకి కేసుతో ప్రత్యక్ష్య సంబంధం లేదు. ఆమె తమ్ముడిని ఇన్​వాల్వ్​చేసి పరోక్షంగా నడిపిస్తోంది’ అని అన్నారు. 

ఈ సందర్భంగా తన ఫోన్​లో ఒక వీడియో చూపించారు.  తర్వాత పోలీసులు వెళ్లిపోవాలని కోరడంతో అక్కడి నుంచి బయలుదేరారు. ఈ విషయమై ఇన్​స్పెక్టర్​రామకృష్ణ వివరణ కోరగా..న్యాయవాది ఫిర్యాదు చేసిన కేసుకు సంబంధించి ఆధారాల కోసం పిలిచామని,  అతడి దగ్గర మద్యం వాసన రావడంతో టెస్ట్​ చేసి పంపించి వేశామన్నారు.