- ఫోర్స్డ్ లేబర్ చట్టాన్ని అమలు చేయడంతో భారత్‌పై టారిఫ్ తగ్గింపు
వాషింగ్టన్: వెట్టి చాకిరీ (ఫోర్స్డ్ లేబర్) ద్వారా తయారుచేసిన వస్తువుల దిగుమతులపై సరైన నిషేధం అమలు చేయడంలేదనే ఆరోపణలతో భారత్ సహా 60 భాగస్వామ్య దేశాలపై 10% నుంచి 12.5% వరకు టారిఫ్‌లు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తమ దేశంలోకి వచ్చే దిగుమతుల్లో 'వెట్టి చాకిరీ' ద్వారా తయారైన వస్తువులు లేకుండా చూడటం కోసం అమెరికా 60కి పైగా దేశాలపై అధ్యయనం చేసింది. తొలుత ఈ నిబంధనలను అమలు చేయడం లేదంటూ 1974 నాటి ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 కింద భారత్‌పై కూడా మొదట 12.5% పన్ను వేయాలని భావించింది.
అయితే, భారత ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు అమెరికాతో మాట్లాడి.. దేశంలో వెట్టి చాకిరీని నిరోధించామని, చట్టాల అమలును వేగవంతం చేస్తున్నామని వివరించడంతో ఆ పన్నును 10 శాతానికి తగ్గించారు. ఫోర్స్డ్ లేబర్‌పై నెలల తరబడి సాగిన అధ్యయనం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా గురువారం ప్రకటించింది. భారత్, బ్రిటన్, కెనడా, మెక్సికో, ఇండోనేసియా వంటి 17 దేశాలకు 10% సుంకాన్ని వర్తింపజేయగా.. చైనా సహా ఇతర 43 దేశాలకు 12.5% సుంకాన్ని ఖరారు చేశారు.
ఫిబ్రవరిలో ప్రకటించిన 10% గ్లోబల్ టారిఫ్ గడువు ఈ వారంతో ముగియడంతో ఈ కొత్త ‘సెక్షన్ 301’ టారిఫ్‌లు అమల్లోకి వచ్చాయి. అయితే, వీటికి ముగింపు తేదీ అంటూ ఉండదు. ఈ 10% టారిఫ్‌తో భారత్ స్థానం పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇతర లాటిన్ అమెరికా, ఆసియా ఆర్థిక వ్యవస్థలతో సమానంగా మారింది. ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కులను కాపాడటానికి, వ్యాపారంలో అన్యాయమైన పద్ధతులను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
