ప్రతికూల వాతావరణంలో సైతం ఆందోళన చేస్తుంటే..

ప్రతికూల వాతావరణంలో సైతం ఆందోళన చేస్తుంటే..

ప్రభుత్వం విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా పాతర పెట్టే ప్రయత్నం చేస్తోంది
తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్

హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని ఎనిమిది వేలమంది విద్యార్థులు ప్రతికూల వాతావరణంలో సైతం ఆందోళన చేస్తుంటే.. రాజకీయాలు చేస్తున్నారని విద్యార్థులపై ఆరోపణలు చేయడం వారిని ఇబ్బందులకు గురి చేయడం, ఏమాత్రం సమంజసం కాదని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై. అశోక్ కుమార్, ముత్యాల రవీందర్ ఒక సంయుక్త ప్రకటనలో  పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన కనీ సౌకర్యాలు కల్పించకపోగా కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించే రీతిలో ప్రభుత్వ విద్యా వ్యవస్థకు పాతర పెట్టే ప్రయత్నం చేస్తున్నారని శారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
తెలంగాణలో గ్రామీణ విద్యార్థులకు పదవ తరగతి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి సాంకేతిక విద్యను అందిస్తున్న ఏకైక విద్యాసంస్థ బాసర ట్రిపుల్ ఐటీ అని వారు గుర్తు చేశారు. ఇందులో చదువుతున్న విద్యార్థులకు గత కొన్ని సంవత్సరాలుగా కనీస సౌకర్యాలు , సదుపాయాలు, బోధన సిబ్బంది మరియు టీచింగ్ మెటీరియల్ ను ప్రభుత్వం సమకూర్చక పోవడం సరికాదన్నారు. రెగ్యులర్ అధ్యాపకులను నియమించక పోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రులు వర్షాలు, ఉరుములు మెరుపులను సైతం లెక్క చేయకుండా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం వారి సమస్యలను వెంటనే పరిశీలించి పరిష్కరించాల్సింది పోయి, అవగాహన లేకుండా అధికారులు, మంత్రి గారు మాట్లాడడం సహేతుకం కాదన్నారు. 
గ్రామీణ ప్రాంతం విద్యార్థులకు సాంకేతిక విద్యా అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశం తో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేస్తే నేటి తెలంగాణ ప్రభుత్వం సరిపడినన్ని నిధులు సమాకుర్చకుండా పాతరపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ వైఖరి ప్రైవేట్, కార్పొరేట్ విశ్వ విద్యాలయాలను ప్రమోట్ చేయడానికే అన్నట్టుగా ఉందనిపిస్తుందని వారు ఆరోపించారు. ఎన్నో ఆశలు ఆశయాలతో గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు తమ పిల్లలను బాసర ట్రిపుల్ ఐటీలో చదివించాలనే కోరుకుంటున్నారని.. కానీ ప్రభుత్వం అక్కడ వారికి సరైన సదుపాయాలు కల్పించడం లేదన్నారు.

విద్యార్థులు తాము ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అధికారులకు తెలిపినా పరిష్కరించకపోవడం శోచనీయం అన్నారు. నాణ్యమైన ఆహారం కూడా సరిగా అందించకుండా, యూనిఫామ్స్ లేకుండా, లాప్ టాపులు అందించకుండా,ప్రభుత్వ నిర్లక్ష్యం వహించడం సబబు కాదని టీపీటీఎప్ నేతలు పేర్కొన్నారు. బాసర విద్యార్థులు పేర్కొన్న అన్ని రకాల డిమాండ్లను వెంటనే పరిశీలించి, పరిష్కరించి.. విద్య పట్ల తనకున్న బాధ్యతను ప్రభుత్వం రుజువు చేసుకోవాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై. అశోక్ కుమార్, ముత్యాల రవీందర్ పునరుద్ఘాటించారు. .ప్రభుత్వం వెంటనే విద్యార్థుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 
ప్రధాన డిమాండ్లు: 
1. ట్రిపుల్ ఐటీ కి ప్రతి ఏటా  ఎలాంటి ఆటంకాలు లేకుండా నిధులు మంజూరు చేయాలి
2. దాదాపు 10 ఏళ్లకు పైగా పని చేస్తున్న కాంటాక్ట్ లెక్చరర్స్ సేవలను క్రమబద్దీకరించాలి.
3. అన్ని రకాల బోధన, బోధనేతర సిబ్బంది ని నియమించాలి.
4. విద్యార్థులందరికీ ల్యాప్ టాపులు ( laptops) అందజేయాలి.
5. మెరుగైన మంచి నీటిని సరఫరా చేయాలి.
6. పరిశుభ్రమైన భోజనశాల ను నిర్వహిస్తూ, నాణ్యమైన భోజనాన్ని అందించాలి
7. విద్యార్ధుల నివాసం ఉండేందుకు కావాల్సిన కనీస వసతులైన పడకలను (బెడ్లను) సమకూర్చాలి.
8. మహిళా విద్యార్థులకు కేర్ టేకర్లను నియమించాలి.
9. క్యాంపస్లో అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించాలి.