
ఖైరతాబాద్, వెలుగు: సమాజంలో ఏ వర్గానికి అన్యాయం జరగవద్దనే ఉద్దేశంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం ఫిల్మ్ నగర్‌లోని జ్ఞానిజైల్ సింగ్ నగర్ బస్తీలో మాలవెలుగు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దండు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్‌రావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ జీవితకాలం పోరాడారని, ఆయన ఆశయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
కుల వివక్షను పోగొట్టేందుకు చేసిన కృషిని మరువలేమన్నారు. అందరూ ఆయన అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. పేద వర్గాలకు విద్యను మించిన ఆస్తి లేదని, ఎంత కష్టం వచ్చినా సరే పిల్లలకు చదువు చెప్పించాలన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నారని, తాను సైతం తెలంగాణ ఉద్యమంలో ఇదే విషయం పలు సభల్లో చెప్పానని గుర్తు చేశారు. చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ అందరి వారని, ఆయనను ఏ వర్గానికి పరిమితం చేయొద్దని సూచించారు. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన దండు లక్ష్మణ్‌ను వివేక్ వెంకటస్వామి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పట్ల లోకేశ్వరరావు, రాజలింగం, బత్తుల మధుసూదన్, దండు మన్యం, దండు
రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.