హైదరాబాద్ సిటీ, వెలుగు: అంబేద్కర్ యూనివర్సిటీని డిజిటల్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించామని వీసీ ఘంటా చక్రపాణి అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో బుధవారం ‘స్పోర్ట్స్ అండ్ వెల్‌బీయింగ్ డే’ ప్రోగ్రామ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారు, మాజీ డీజీపీ బి.శివధర్ రెడ్డి పాల్గొన్నారు.
వీసీ చక్రపాణి మాట్లాడుతూ.. విద్యా వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్, ఇన్‌క్లూజన్, ఇన్‌స్టిట్యూషనల్ ఎక్సలెన్స్, అవుట్‌రీచ్ అంశాలను ప్రధాన థీమ్‌లుగా ప్రకటించిందని తెలిపారు. త్వరలో ఆన్‌లైన్ కోర్సులు ప్రారంభిస్తామని చెప్పారు. శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
