- ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి
- వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్: మంత్రి దామోదర
- సెప్టెంబర్‌లో చౌటుప్పల్ ఏరియా హాస్పిటల్ ప్రారంభం
- సెక్రటేరియెట్‌లో వైద్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంఎన్‌జే తర్వాతి రెండో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక క్యాన్సర్ వైద్యం అందేలా వరంగల్ రీజనల్ క్యాన్సర్ హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలతో పాటు మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య సేవలపై మంగళవారం సెక్రటేరియట్ లోని తన చాంబర్‌లో మంత్రి వేర్వేరుగా రివ్యూ చేశారు.
ఎంజీఎంలో సేవల విస్తరణ
వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల సమీక్షలో మంత్రి కొండా సురేఖతో కలిసి వైద్య సేవలపై దామోదర చర్చించారు. ఎంజీఎం హాస్పిటల్లో ప్రస్తుతం ఉన్న 29 స్పెషాలిటీ సేవలకు అదనంగా మరో తొమ్మిది సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఎంజీఎంకు అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను రెగ్యులర్ సూపరింటెండెంట్‌గా నియమిస్తామన్నారు. నిమ్స్ తరహాలోనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఎల్‌వోసీలు మంజూరు చేస్తామని, వరంగల్‌ను ఉత్తర తెలంగాణకు మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. హన్మకొండలో ఐవీఎఫ్ సెంటర్‌తో పాటు డ్రగ్ అండ్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రీజనల్ ఐ హాస్పిటల్‌లో అత్యాధునిక కంటి వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. పరకాల, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్‌పూర్, బచ్చన్నపేట, పాలకుర్తి, కమలాపూర్ ప్రాంతాలకు మంజూరైన డయాలసిస్ సెంటర్లను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. జనగామ, నర్సంపేట జనరల్ హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ పనితీరును పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారిని స్పెషల్ ఆఫీసర్‌గా నియమించాలని ఎమ్మెల్యేలు కోరగా, పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, యశస్విని రెడ్డి, కేఆర్ నాగరాజు, వైద్యశాఖ ఉన్నతాధికారులు క్రిస్టినా జడ్ చొంగ్తు, సంగీత సత్యనారాయణ, వాణి, రవిందర్ పాల్గొన్నారు.
సెప్టెంబర్‌లో చౌటుప్పల్ ఏరియా హాస్పిటల్ ప్రారంభం
మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ధిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష జరిపారు. చౌటుప్పల్ ఏరియా హాస్పిటల్ నిర్మాణ పనులను ఈ నెల చివరికల్లా పూర్తి చేసి, సెప్టెంబర్‌లో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 100 బెడ్ల హాస్పిటల్‌కు అనుగుణంగా ఎక్విప్‌మెంట్, డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని సూచించారు. చౌటుప్పల్‌లో మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్, ట్రామా కేర్ సెంటర్లను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. నియోజకవర్గంలోని నాంపల్లి, మునుగోడు పీహెచ్‌సీలను కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు.
