కరోనాతో అమెరికా ఆగమాగం

కరోనాతో అమెరికా ఆగమాగం

కరోనాతో కష్టాలు

లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు..

అత్యంత దారుణంగా న్యూయార్క్ పరిస్థితి

ఆర్థిక వ్యవస్థనూ దెబ్బతీస్తున్న వైరస్

న్యూయార్క్: పరిస్థితి సీరియస్గానే ఉన్నా, అంతా బాగానే ఉందంటూ చెప్పుకొచ్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. దేశం మొత్తాన్ని బంద్ చేయాల్సిన అవసరం లేదన్నారు. మూసేస్తే ఎకానమీకి ఎఫెక్ట్ అని చెబుతూ వచ్చారు. కానీ పరిస్థితి చేయిదాటాక చర్యలు చేపడుతున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఎమర్జెన్సీని ప్రకటించేందుకు ఓకే చెప్పేశారు. డిజాస్టర్ డిక్లరేషన్పై సంతకం చేశారు. అమెరికా వర్జిన్ ఐల్యాండ్స్, నార్తర్న్ మేరియానా ఐల్యాండ్స్, వాషింగ్టన్ డీసీ, గ్వామ్, పోర్టోరికో సహా దేశం మొత్తం డిజాస్టర్ డిక్లరేషన్ కిందకు వచ్చేశాయి. కేంద్ర నిధులు వాడుకునేలా రాష్ట్రాలకు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఓకే చెప్పింది.

ముసలోళ్లపైనే పంజా
దేశంలో ఎక్కువగా ముసలోళ్లపై, అది కూడా మగవాళ్లపైనే కరోనా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. పదిలో నలుగురు 85 ఏళ్లపైబడిన వారు కరోనా బారిన పడుతుంటే, పదిలో ఒకరు మధ్య వయసు వాళ్లుంటున్నారు. కేర్పోర్ట్హెల్త్ అనే సంస్థ అక్కడి కేసులు, మరణాలపై ఓ రిపోర్టును విడుదల చేసింది. వెయ్యి హాస్పిటళ్లు, 1.8 లక్షల మంది హెల్త్కేర్ ప్రొవైడర్ల డేటా ఆధారంగా ఆ నిర్ధారణకు వచ్చింది. వైరస్తో ఆస్పత్రిలో చేరిన వాళ్లలో ఎక్కువగా కిడ్నీ బాధితులే చనిపోతున్నట్టు పేర్కొంది. మిగతా వాళ్లతో పోలిస్తే కిడ్నీ పేషెంట్లు 2.5 రెట్లు ఎక్కువగా చనిపోతున్నారు.

వెంటిలేటర్లు లేవు..
దేశంలో పెరిగిపోతున్న పేషెంట్ల తాకిడికి, అక్కడ ఉన్న మెడికల్ సౌలతులు సరిపోవట్లేదు. పరిస్థితి సీరియస్గా ఉన్నోళ్లకు వెంటిలేటర్లు దొరకని దుస్థితి ఉంది. దేశం మొత్తం కలిపి లక్షా 70 వేల వెంటిలేటర్లకు మించి లేవని ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) చెబుతోంది. పీక్ టైంలో 17 వేల కన్నా ఎక్కువ వెంటిలేటర్లు అవసరం ఉండదని అంటోంది. కానీ, కరోనా ఆ పరిస్థితి మార్చేసిందని చెబుతోంది. న్యూయార్క్లో పరిస్థితి మరింత దారుణం. ఒక్కో పేషెంట్కు లాటరీల ద్వారా వెంటిలేటర్ పెడుతున్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, దీనిపై వ్యతిరేకత రావడంతో దాన్ని ఉపసంహరించుకుంది ఆ రాష్ట్రం. పరిస్థితి విషమంగా ఉన్నోళ్లు, వెంటిలేటర్ పెడితే బతుకుతారు అనుకున్నోళ్లకు మాత్రమే వాటిని అందిస్తోంది. కెంటకీ, వాషింగ్టన్ వంటి రాష్ట్రాలూ ఈ విషయంలో న్యూయార్క్నే ఫాలో అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ (డీపీఏ)ని అమలు చేసిన ట్రంప్, 30 వేల వెంటిలేటర్లను తయారు చేయాల్సిందిగా జనరల్ మోటార్స్ను ఆదేశించారు. ఇప్పుడు కంపెనీ అదే పనిలో ఉంది. ఫోర్డ్ కూడా జీఈ హెల్త్కేర్తో జట్టుకట్టింది.

మార్చురీలు ఫుల్.. పూడ్చేందుకు స్థలం నిల్
కరోనా మరణాలు పెరిగిపోతుండడంతో మార్చురీలు ఫుల్ అయిపోయాయి. దీంతో కొన్ని శవాలను బయటే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని నుంచి బయటపడేలా న్యూయార్క్ వంటి సిటీల్లో మొబైల్ మార్చురీలను ఏర్పాటు చేస్తున్నారు. న్యూయార్క్ స్టేట్లోని అన్ని ప్రాంతాల్లో ఆస్పత్రుల వద్ద ఇప్పటికే మొబైల్ మార్చురీలు పెట్టారు. షికాగో కుక్కౌంటీలో 2 వేల శవాలను దాచేలా టెంపరరీ మార్చురీని పెట్టారు. ట్రక్కులు, ఇతర వాహనాలను మార్చురీలుగా మారుస్తున్నారు. ఇక, చనిపోయిన వారిని పూడ్చేందుకు స్థలం కూడా చాలట్లేదు. వాళ్లందరినీ ఒకే చోట పూడ్చేస్తున్నారు.

షాపుల్లో సరుకులైపోతున్నయ్
కేసుల తీవ్రత పెరగడం, ఎమర్జెన్సీకి ఓకే చెప్పడంతో జనాలు ఆందోళన పడి సరుకులు మీదమీదపడి కొనేస్తున్నారు. షాపుల్లో దొరికిన కాడికి నిత్యావసరాలను కొనేసి ఇంట్లో స్టాక్ పెట్టేసుకుంటున్నారు. చాలా సూపర్మార్కెట్లలో ఖాళీ ర్యాకులు కనిపిస్తున్నాయి. అక్కడ ఎక్కువ ప్యాకేజ్డ్ ఫుడ్డే కావడంతో జనాలకు తిప్పలు తప్పట్లేదు. కిలోమీటర్లమేర క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. అంతసేపు నిలబడినా తమ వంతు వస్తుందో రాదోనన్న పరిస్థితి ఉందక్కడ. ఇక, అమెరికన్లకు డబ్బు సాయం చేసేందుకు కేటాయించిన 2 లక్షల కోట్ల డాలర్ల ఫండ్ను ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ విడతల వారీగా విడుదల చేస్తోంది. మొదటి విడతలో భాగంగా శనివారం కొంత మంది అకౌంట్లలో చెక్కుల ద్వారా డబ్బు జమ చేసినట్టు చెప్పింది.

పోలీసుల చావుకొచ్చింది
దేశంలో కరోనా కేసులు పోలీసుల చావుకొచ్చింది. కేసుల కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులూ కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ (ఎన్వైపీడీ)లో ఎక్కువ మంది బాధితులయ్యారు. మొత్తం 36 వేల మంది పోలీసులు ఎన్వైపీడీలో పనిచేస్తుండగా, పోయిన శుక్రవారం నాటికి 7,096 మంది జబ్బు పడ్డారు. అందులో 2,314 మంది పోలీసులు, 453 మంది అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగులకు కరోనా పాజిటివ్గా తేలింది. అందులో 19 మంది చనిపోయారు. అమెరికాలో నమోదైన కేసుల్లో ఎక్కువ న్యూయార్క్లోనే ఉన్నాయి. నేసావు, సఫోక్, వెస్ట్చెస్టర్, రాక్లాండ్ వంటి సబ్అర్బన్ కౌంటీల్లోనే 93 శాతం కేసులు రికార్డయ్యాయి.

అమెరికా చేరిన ఇండియన్ క్లోరోక్విన్
ఇండియా క్లోరోక్విన్ మందులు అమెరికాకు చేరాయి. మొత్తం 35.82 లక్షల ట్యాబ్లెట్లతో పాటు 9 టన్నుల ఏపీఐ అగ్రరాజ్యానికి అందాయి. ఆ మందులు శనివారం నెవార్క్ ఎయిర్పోర్టుకు వచ్చాయని అమెరికాకు ఇండియన్ అంబాసిడర్ తరణ్జీత్ సింగ్ సంధు ట్వీట్ చేశారు.

బెడ్లు చాలట్లే.. మాస్కులు దొరకట్లే
న్యూయార్క్లో పెరిగిపోతున్న పేషెంట్ల సంఖ్యకు తగ్గట్టు ఆస్పత్రుల్లో చాలినన్ని బెడ్లు లేవు. దీంతో పరిస్థితి దయనీయంగా తయారైంది. అయితే, గవర్నర్ ఆండ్రూ కువోమో మాత్రం, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు. అన్ని ఆస్పత్రుల్లోనూ ఐసీయూ బెడ్లు సిద్ధం చేశామని, చెప్పాలంటే మొత్తం ఆస్పత్రులనే ఐసీయూ వార్డులుగా మార్చామని చెబుతున్నారు. కనెక్టికట్, మసాచుసెట్స్, న్యూజెర్సీ, న్యూయార్క్, రోడ్ ఐల్యాండ్స్, మేరీల్యాండ్, అలస్కా, నెవడా, హవాయి, జార్జియా, మిషిగన్ వంటి రాష్ట్రాల్లో ఐసీయూ బెడ్ల కొరత వేధిస్తోంది. అంతేకాదు, డాక్టర్లకు అవసరమైన మాస్కులు, ప్రొటెక్టివ్సూట్లు కూడా లేవని వైద్య సిబ్బంది అందరూ ఆందోళన చెందుతున్నారు. దీంతో కరోనా పేషెంట్లను ట్రీట్చేస్తున్న కొందరు డాక్టర్లు, నర్సులు కరోనాకు బలవుతున్నారు. డీపీఏ కింద కేటాయించే నిధులతో ఎన్95 మాస్కులను తయారుచేయించేందుకు పెంటగాన్ ముందుకొచ్చింది. 13.3 కోట్ల డాలర్ల కాంట్రాక్టులు ఇవ్వనుంది.

ఆల్ ఈజ్ వెల్: ఫాసీ
దేశంలో కరోనా పరిస్థితిపై కొంచెం ఊరటనిచ్చే విషయం చెప్పారు డాక్టర్​ ఆంథోనీ ఫాసీ. కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నా రు. మే నాటికి అంతా సర్దుకుంటుందని, అన్నీ ఓపెన్​ అవుతాయని చెప్పారు. కచ్చి తంగా తొందర్లోనే అంతా బాగవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసుల తీవ్రత తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఈ నెల చివరి నాటికి మెరుగవుతుందని, ఆంక్షలు ఎత్తేస్తామని చెప్పారు.

ఎకానమీపైనా ఎఫెక్ట్
దేశ ఎకానమీపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచ మార్కెట్లు మొత్తం ప్రస్తుతం డాలర్​పైనే ఆధారపడ్డాయి. అక్కడ కొంచెం నష్టం జరిగినా ప్రపంచ దేశాలూ నష్టపోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే డాలర్​ క్షీణించకుండా, ఆర్థిక వ్యవస్థ నష్టపోకుండా ట్రంప్ చర్యలు తీసుకున్నారు. నిజానికి అన్ని చోట్ల లాక్​డౌన్​ పెట్టకపోవడానికి ఇదీ కారణమేనంటున్నారు నిపుణులు. ఆర్థిక వ్యవస్థ కుదేలవకుండా ఇప్పటికే ఫెడరల్ రిజర్వ్​ వడ్డీ రేట్లను తగ్గించింది. అయితే, ప్రపంచ దేశాల్లోని పరిస్థితులను చూస్తే మాత్రం భవిష్యత్ లో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందంటున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో సప్లై చెయిన్లు బ్రేక్​ అవడం, ఎక్కడివక్కడే ఆగిపోవడం వంటి వాటితో అమెరికా ప్రొడక్షన్​, ఎక్స్ పోర్ట్​లపై ప్రభావం పడిందంటున్నారు. గ్లోబల్ డిమాండ్​ మరింత పడిపోతే ఎఫెక్ట్​ ఎక్కువవుతుందంటున్నారు.

తెలుగు రాష్ట్రాలపై ఎఫెక్ట్‌‌‌‌
అమెరికాలో తెలంగాణ, ఏపీల నుంచి వెళ్లిన సాఫ్ట్ వేర్‌‌‌‌ ఇంజినీర్లు ఎక్కువగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌లోని సంస్థలకు అత్యధిక ప్రాజెక్టులు అమెరికా నుంచే వస్తుంటాయి. కరోనాతో పరిస్థితులు మారిపోయాయి. కొత్త ప్రాజెక్టుల విషయంలో ఇక్కడి సంస్థలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని ఎక్స్‌‌‌‌పర్ట్స్ అంటున్నారు. దీంతో ఇక్కడి సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ ఉద్యోగాల్లో కోత, జీతాల్లో తగ్గింపు తప్పదంటున్నారు.  హైదరాబాద్‌‌‌‌, దాని చుట్టుపక్కల స్థలాలు, ఇండ్లు, ఫ్లాట్లపై తెలుగోళ్లు ఎక్కువే ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో ఇక్కడి రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ బిజినెస్‌‌‌‌పై ఎఫెక్ట్‌‌‌‌ ఉంటుందంటున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఎవరి జాబ్స్‌‌‌‌కు సెక్యూరిటీ లేదు. హెచ్‌‌‌‌1బీ వీసాపై వచ్చి ఉద్యోగం చేస్తున్న వారు తమ జాబ్‌‌‌‌ కోల్పోతే రెండు నెలల గ్రేస్‌‌‌‌ పిరియడ్‌‌‌‌ లోపు మరో జాబ్‌‌‌‌లో చేరాలి. లేదంటే వారి వీసా పర్మిషన్‌‌‌‌ రద్దవుతుంది. ఈ రూల్ మనోళ్లకు నిద్రపట్టనివ్వట్లేదు. ఎడ్యుకేషన్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూషన్లు ఎప్పుడు తెరుస్తారో తెలియదు. వేలమంది ఇండియన్‌‌‌‌ స్టూడెంట్లు చిక్కుకున్నారు.  మన దేశం నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డ, వీసాలపై వెళ్లి జాబ్స్‌‌‌‌ చేస్తున్న వారి ద్వారా వస్తున్న విదేశీ మారకద్రవ్యం తగ్గనుంది.

For More News..

రూ. 300 కే పండ్లబుట్ట

క్యూలో ప్రాణాలు.. 15 గంటలైనా హాస్పిటల్‌‌ బయటే పేషెంట్లు

భారత్ లో 9వేలు దాటిన కేసులు