మస్క్​కు ఆశ్రయమిచ్చేందుకు రెడీ.. రాజకీయ శరణార్థిగా అవకాశం కల్పిస్తామన్న రష్యా

మస్క్​కు ఆశ్రయమిచ్చేందుకు రెడీ.. రాజకీయ శరణార్థిగా అవకాశం కల్పిస్తామన్న రష్యా
  • రాజకీయ శరణార్థిగా అవకాశం కల్పిస్తామన్న రష్యా
  • ట్రంప్​, మస్క్​ గొడవపై చర్చలు
  • శాంతి కుదుర్చుతానంటూ రష్యా మాజీ ప్రెసిడెంట్​ ఆఫర్​
  • స్మైలీ ఎమోజీతో మస్క్​ రిప్లై
  • మస్క్​ కొత్త పార్టీపై  సోషల్​ మీడియాలో ప్రచారజోరు

మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో వివాదాల వేళ.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ ​మస్క్​కు రష్యా బంపర్​ ఆఫర్​ ప్రకటించింది. తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఉండేలా అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు రష్యాకు చెందిన స్టేట్ డూమా కమిటీ ఆన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఫస్ట్​ డిప్యూటీ చైర్మన్ దిమిత్రి నోవికోవ్ ఈ ప్రకటన చేశారు.  ‘‘ఎలాన్​ మస్క్ కు ఎప్పుడూ భిన్నమైన వ్యూహం ఉంటుందని నాకు తెలుసు. ఆయనకు ఎలాంటి రాజకీయ ఆశ్రయం అవసరం ఉండదు. ఒకవేళ గనుక ఆయన రాజకీయ శరణార్థిగా ఉండాలనుకుంటే రష్యా ఆశ్రయం కల్పిస్తుంది” అని తెలిపారు. అమెరికన్​ విజిల్​ బ్లోయర్​ ఎడ్వర్డ్‌‌ స్నోడెన్‌‌ లాగానే మస్క్‌‌కు రష్యాలో రాజకీయ శరణార్థిగా అవకాశం కల్పిస్తారా?  అని మీడియా అడిగిన ప్రశ్నకు నోవికోవ్​ ఈవిధంగా సమాధానమిచ్చారు. కాగా, మస్క్ ఓ అక్రమ గ్రహాంతరవాసి అని,  ఆయనను యునైటెడ్ స్టేట్స్ నుంచి  బహిష్కరించి స్పేస్‌‌ ఎక్స్‌‌ను స్వాధీనం చేసుకోవాలని వైట్ హౌస్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నోవికోవ్​ ప్రకటన ప్రాధాన్యత సంతరించకున్నది. ట్రంప్‌‌, మస్క్‌‌ల మధ్య నెలకొన్న వివాదంపై జోక్యం చేసుకునేందుకు రష్యా  ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌‌ నిరాకరించారు.

కొట్టుకోకండి ఫ్రెండ్స్​..: మెద్వెదెవ్​​

 ట్రంప్‌‌, మస్క్‌‌ మధ్య నెలకొన్న వివాదంపై రష్యా మాజీ ప్రెసిడెంట్​ దిమిత్రి మెద్వెదెవ్‌‌ స్పందించారు. ఘర్షణకు దిగొద్దని వారిద్దరికీ సూచించారు. వారి మధ్య సంధి కుదిర్చేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ‘‘డీ (డొనాల్డ్ ట్రంప్‌‌), ఈ (ఎలాన్ మస్క్‌‌) మధ్య శాంతి ఒప్పందాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు మేం సిద్ధం. అయితే, దీనికి కొంత ఫీజు తీస్కుంటం.  ఈ ఫీజు కింద స్టార్​ లింక్​ షేర్లు ఇచ్చినా సరే’’ అని ఎక్స్​లో పోస్ట్​పెట్టారు. దీనికి కూడా ఎలాన్​ మస్క్​ నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు. ఇదిలా ఉండగా.. రష్యన్ సెనేటర్, గతంలో దేశ అంతరిక్ష కార్యక్రమాన్ని నడిపిన దిమిత్రి రోగోజిన్​ కూడా మస్క్​కు మరో ఆఫర్​ ఇచ్చారు. ‘‘అమెరికాలో మీరు సమస్యలు ఎదుర్కొంటుంటే మా దేశానికి రండి. ఇక్కడ మీకు నమ్మకమైన సహచరులతోపాటు సాంకేతిక సృజనాత్మకత కు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది” అని ఆహ్వానించారు.

ట్రంప్​పై  వివాదాస్పద పోస్ట్​.. వెంటనే డిలీట్​

అతిపెద్ద బాంబు పేల్చాల్సిన సమయం వచ్చిందంటూ ట్రంప్​ను ఉటంకిస్తూ పోస్ట్​ పెట్టిన ఎలాన్​ మస్క్.. దాన్ని డిలీట్​ చేశాడు.  సెక్స్‌‌ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌‌స్టైన్‌‌కు సంబంధించిన ఇన్వెస్టిగేషన్​ ఫైళ్లలో ట్రంప్‌‌ పేరు కూడా ఉందని మస్క్​ ఆరోపించారు. ఈ పోస్ట్​ సంచలనం సృష్టించడంతో మస్క్​వెంటనే దాన్ని డిలీట్​ చేసినట్టు తెలుస్తున్నది.

 ‘ది అమెరికా పార్టీ’  అంటూ మస్క్​ పోస్ట్​ 

ట్రంప్‌‌తో విభేదించిన ఎలాన్‌‌ మస్క్‌‌ సోషల్​ మీడియాలో ఓ ఆసక్తికర చర్చకు తెరలేపారు. అమెరికాలో కొత్త పార్టీ అవసరమంటూ పోస్ట్​ పెట్టారు.  80% అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమా? అంటూ తన ఫాలోవర్లను ‘ఎక్స్‌‌’లో ప్రశ్నించారు.  దీనికి 80% మంది అమెరికన్లు​ అనుకూలంగా ఓటేశారు. దీంతో మస్క్​ పెట్టబోయే పార్టీ పేరు ‘ది అమెరికా పార్టీ’ అంటూ ప్రచారం జోరందుకున్నది. అయితే, మస్క్​ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.