
- అధికారుల ఆకస్మిక తనిఖీలు
- బట్టల వ్యాపారిపై దాడి..అనేక మంది అదుపులోకి
- ఫెడరల్ భవనం వెలుపల ప్రజల ఆందోళన
- లాఠీలు, టియర్‌గ్యాస్, పెప్పర్‌స్ప్రే తో చెదరగొట్టిన పోలీసులు
న్యూయార్క్: అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపుతున్నది. వైట్‌హౌస్ ఆదేశాలమేరకు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని వలసదారులను గుర్తించేందుకు లాస్ ఏంజెల్స్‌లో ఫెడరల్ అధికారులు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అక్రమ వలసదారుడిగా పేర్కొంటూ ఓ బట్టల వ్యాపారిపై దాడిచేయడంతోపాటు కొంతమంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
వందల సంఖ్యలో ప్రజలు అక్కడ గుమిగూడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రోడ్ల పైకి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని, లాఠీలు, టియర్‌గ్యాస్‌తో ఆందోళనకారులను చెదరగొట్టారు. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయెర్టాను కూడా అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. సాయంత్రం 4 గంటల సమయానికి లాస్ఏంజెల్స్ఫెడరల్ భవనం వెలువల వందలాది మంది గుమిగూడి ఆందోళన చేపట్టారు. డేవిడ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళనకారులపై అధికారులు పెప్పర్ స్ప్రే ప్రయోగించారు.
వైట్ హౌస్ ఆదేశాల మేరకే..
అక్రమ వలసదారుల ఏరివేతకు అమెరికా సర్కారు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే తాము అరెస్టులు చేస్తున్నట్టు ఫెడరల్ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి, రోజుకు కనీసం 3వేల మందిని అరెస్ట్ చేయాలని వైట్ హౌస్ ఎయిడ్ స్టీఫెన్ మిల్లర్ తమకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భాగంగానే 3 సెంట్రల్ లాస్ ఏంజెల్స్ ప్రదేశాల్లో ఏజెంట్లు 4 ఫెడరల్ సెర్చ్ వారెంట్లను అమలు చేశారని చెప్పారు. దాదాపు 44 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేశామని, తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.