రోజూ 2 లక్షల కేసులు.. 3 వేల మరణాలు!

రోజూ 2 లక్షల కేసులు.. 3 వేల మరణాలు!

వాషింగ్టన్/జెనీవాకరోనా వల్ల అన్ని దేశాల కంటే అమెరికానే ఘోరంగా నష్టపోయింది. ఆ దేశంలో అటు కేసులు, ఇటు మరణాలు భారీగా పెరుగుతున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను సడలించడంతో రానున్న రోజుల్లో కేసులు, మరణాలు మరింతగా పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ 1 నాటికి అక్కడ పరిస్థితి భయంకరంగా ఉండనుందంటూ లోకల్ మీడియా వెల్లడించింది. గవర్నమెంట్ కు నిపుణులు అందజేసిన ఇంటర్నల్ డ్రాఫ్ట్ రిపోర్టులో ఇవే విషయాలు ఉన్నాయని తెలిపింది. లాక్ డౌన్ ఎత్తివేస్తున్నందున మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా మారనుందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ రిపోర్టులో పేర్కొన్న వివరాలను వైట్ హౌస్, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఖండించాయి. జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్ బర్గ్ స్కూల్ ఆఫ్​పబ్లిక్ హెల్త్ కు చెందిన ఎపిడెమియాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ జస్టిన్ లెస్లర్ పేరుతో విడుదలైన ఈ రిపోర్టును అమెరికన్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. ఇందులో తన పాత్రేమీ లేదని, ఇది సీడీసీకి సమర్పించిన నివేదికేనని జస్టిన్ చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. రీఓపెనింగ్ తర్వాత త్వరలోనే పరిస్థితి కంట్రోల్ తప్పుతుందని జస్టిన్ భావిస్తున్నట్లు వివరించింది. ఇక అమెరికాలో మంగళవారం నాటికి12.24 లక్షల కేసులు, 71,148 మరణాలు నమోదయ్యాయి.

4 దశల్లో న్యూయార్క్ రీ ఓపెన్: గవర్నర్

న్యూయార్క్‌ను దశలవారీగా ఓపెన్ చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో ప్లాన్ ప్రకటించారు. అన్నింటినీ ఎక్కువకాలం మూసివేస్తే.. మనుగడ కష్టమని అన్నారు. రాష్ట్రంలో 3.29 లక్షల కేసులు, 25 వేల మరణాలు నమోదయ్యాయని, రాష్ట్రాన్ని రీఓపెన్ చేయడం లాక్ డౌన్ చేయడం కంటే ఎంతో కష్టమన్నారు. ‘‘అన్నింటినీ మూసేయడం, ఎకానమీ బంద్ పెట్టడం, ఇండ్లలోనే ఉండిపోవడం.. కొంత కాలం వరకే చేయొచ్చు. ఎల్లప్పుడూ బంద్ పెట్టాలంటే మనుగడ సాగించలేం” అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 10 రీజియన్లలో దశలవారీగా రీఓపెన్ ను అమలు చేస్తామన్నారు. మొదటి దశలో కన్ స్ట్రక్షన్, మానుఫాక్చరింగ్ రంగాలను, రిటైల్ స్టోర్లను అనుమతిస్తామని, రెండు వారాల విరామంతో సెకండ్ ఫేజ్ లో ప్రొఫెషనల్ సర్వీసులు, రియల్ ఎస్టేట్ వంటివి ప్రారంభిస్తామని చెప్పారు. మూడో దశలో రెస్టారెంట్లు, బార్లు.. చివరి దశలో సినిమా థియేటర్లు, మాల్స్ రీఓపెన్ కు అనుమతిస్తామని పేర్కొన్నారు.

ఆధారాలియ్యలే: డబ్ల్యూహెచ్ వో

చైనాలోని వుహాన్​ ల్యాబ్​ నుంచే కరోనా వైరస్ లీక్​ అయిందంటూ అమెరికా చేస్తున్న ఆరోపణలు కేవలం  అనుమానాలేనని వరల్డ్ హెల్త్​ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ వో) పేర్కొంది. దీనికి సంబంధించి అమెరికా ఎలాంటి ఆధారాలనూ ఇవ్వలేదని  మంగళవారం జెనీవాలో డబ్ల్యూహెచ్ వో ఎమర్జెన్సీ డిపార్ట్ మెంట్ చీఫ్ మైకేల్ ర్యాన్ తేల్చి చెప్పారు. ఆధారాలు ఇస్తే విశ్లేషించి, నిజానిజాలను తేల్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. డబ్ల్యూహెచ్ వో సేకరించిన డేటా, ఇతర ఆధారాల ప్రకారం కరోనా వైరస్ సహజంగానే పుట్టినట్లు తేలిందన్నారు. వైరస్ ఏ జీవి నుంచి మొదట పుట్టిందో తెలుసుకునేందుకు చైనా సైంటిస్టులు ప్రపంచంతో కలిసి పనిచేస్తున్నారని ఇలాంటి సమయంలో ఆధారాలు లేని ఆరోపణలు సరికాదన్నారు.