- మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఎంవోయూ చేసుకున్న సంస్థ
హైదరాబాద్, వెలుగు: ప్రముఖ అంతర్జాతీయ బయోటెక్నాలజీ సంస్థ యామ్జెన్.. జీనోమ్‌వ్యాలీలో అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. మంగళవారం సెక్రటేరియెట్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నది. అంతకు ముందు శ్రీధర్ బాబుతో భేటీ అయిన యామ్జెన్ ఇండియా ప్రతినిధులు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాల విస్తరణపై చర్చించారు. సమావేశం అనంతరం యామ్జెన్ ఇండియా ఎండీ నవీన్ గుళ్లపల్లి, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్యలు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశోధన కేంద్రంలో స్థానిక ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. యామ్జెన్ ఇటీవల 3 వేల మంది ఉద్యోగులతో అతి పెద్ద జీసీసీని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఔషధ రంగ దిగ్గజ కంపెనీలు తెలంగాణపట్ల అపార విశ్వాసం కనబర్చడం తమ ప్రభుత్వానికి దక్కిన గౌవరమన్నారు.
ఉద్యోగ అవకాశాల్లో ఇక్కడి యువతకు ప్రాధాన్యమివ్వాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, జీనోమ్ వ్యాలీ వంటి అభివృద్ధి చెందిన ఎకోసిస్టమ్ కారణంగా తెలంగాణ ప్రపంచ లైఫ్ సైన్సెస్ సంస్థలకు కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆయన అన్నారు. దాదాపు 100 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న యామ్జెన్ క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, ఎముకల ఆరోగ్యం, ఇన్‌ఫ్లమేషన్, శ్వాసకోశ వ్యాధులు, అరుదైన వ్యాధులు తదితర తీవ్రమైన అనారోగ్య సమస్యలకు వినూత్న చికిత్సలను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఎంవోయూ కార్యక్రమంలో పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈవో సర్వేశ్ సింగ్, యామ్జెన్ ఇండియా ఎండీ నవీన్ గుళ్లపల్లి, ఈడీ శ్రీను కొసరాజు, అనుమిత తదితరులు పాల్గొన్నారు.
